దోమలగూడ: సింగరేణిలో ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. సింగరేణిలో సర్వీసు నిబంధనలు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సింగరేణి వారసత్వ బాధిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గతంలో 1. 30లక్షల మంది పని చేయగా, ప్రస్తుతం 60 వేల మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు.
ఓపెన్ కాస్ట్‌లు పెరుగుతుండడంతో కార్మికుల సంఖ్య తగ్గుతోందన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోనే యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీన్ని సక్రమంగా అమలు చేయకపోతే కార్మిక కటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వారసత్వ ఉద్యోగాల్లో ఒక సంవత్సరం నిబంధన ఎత్తివేస్తే దాదాపు 2600 మందికి మేలు జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న విఆర్‌ఎస్, గోల్డెన్ షేక్‌హ్యాండ్, డిస్‌మిస్డ్ కార్మికుల సమస్యలను వెటనే పరిష్కరించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో చీకట్లో మగ్గుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు బంగాళాఖాతంలోకి, నిధులు కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఎద్దేవా చేశారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఒక సంవత్పరం నిబంధన ఎత్తి వేసి, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని, సకల జనుల సమ్మెకు సంబంధించిన సింగరేణి కార్మికుల సమ్మెకాలపు వేతనాలపై గట్టిగా ప్రశ్నిస్తేనే ఏడాది తర్వాత ఇచ్చారన్నారు. సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల క్రమంలోనే ప్రభుత్వానికి వారసత్వ ఉద్యోగాలు గుర్తుకు వచ్చాయన్నారు. ఒక్క రోజు ముందు రిటైర్మెంట్ అయినా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన టీజీబీకే యూనియన్ నాయకులు ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు. బీజేపీ ఎమ్మేల్యే ఎన్‌వివిఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మేల్సీ ప్రేంసాగర్‌రావు, వేజ్‌బోర్డు సభ్యులు జనక్‌ప్రసాదు, సీతారామయ్య, బీఎంఎస్ నాయకులు పులి రాజిరెడ్డి, రవిశంకర్, సింగరేణి వారసత్వ భాదిత సంఘం నాయకులు టి నరేష్, వెంకటేష్, హజార్, సాయి, పి శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వాలి
Published Wed, Dec 14 2016 2:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement