ముషీరాబాద్: బీసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర బిసి విద్యార్థి సంఘం విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ పథకాలను ఎత్తి వేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఫీజు బకాయిలను విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 8న కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు.
3నెలల క్రితం తాము చేసిన పోరాటం ఫలితంగా రూ.3100కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, నేడు కేవలం రూ.900కోట్లు మాత్రమే విడుదల చేసి విద్యార్థులను మోసం చేసిందన్నారు. ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు నిబంధనలు విధించడం దారుణమన్నారు.
బీసీలకు ఒక్క గురుకుల పాఠశాల కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు ర్యాగ అరుణ్, శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, విక్రమ్‌గౌడ్, నీర వెంకటేష్, చక్రధర్, మద్దూరి అశోక్‌గౌడ్, జి. కృష్ణ, బత్తిని రాజు పాల్గొన్నారు.