
సింగరేణి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు
గోదావరిఖని : తెలంగాణకు హరితహారం రెండో దశ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న గోదావరిఖనిలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభించారు. శుక్రవారం స్థలాన్ని చదును చేసి, దాదాపు ఐదు వేల మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలను తవ్వించారు. ఆర్జీ-1 ఇన్‌చార్జి సీజీఎం సుధాకర్‌రెడ్డి, రామగుండం రీజియన్ ఫారెస్ట్ విభాగం డెప్యూటీ మేనేజర్ కర్ణా నాయక్, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ అంబటి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ దాదాసలాం పనులను పరిశీలించారు.
ఒకే రోజు 3.50 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు
ఈ నెల 18న ఒకే రోజు రామగుండం రీజియన్ పరిధిలో 16 చోట్ల 3.50 లక్షల మొక్కలు నాటేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్జీ-1 డివిజన్‌లో 1.50 లక్షల మొక్కలు, ఆర్జీ-2లో లక్ష మొక్కలు, ఆర్జీ-3లో లక్షలు మొక్కలు నాటనున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని మేడిపల్లి ఓసీపీ, ఆర్జీ-1 ఎంవీటీసీ, పీజీ, డిగ్రీ కళాశాల, కాలనీ పరిధిలోని పోచమ్మ దేవాలయం, వకీల్‌పల్లి గని, ఓసీపీ-3 ఆవరణ, అల్లూరు ఏరియా, ఓసీపీ-1, ఓసీపీ-2, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు, జూలపల్లి గ్రామంతో పాటు అన్ని ఏరియాల్లోని రహదారుల పక్కన మొక్కలు నాటనున్నారు. 18న ముఖ్యమంత్రి డిగ్రీ కళాశాలలో కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక సింగరేణి ఎంవీటీసీ ఆవరణలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర అధికారులు మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.