త్వరలో భద్రాద్రికి సీఎం రాక ! | CM KCR visit badradhri soon | Sakshi
Sakshi News home page

త్వరలో భద్రాద్రికి సీఎం రాక !

Published Sun, Feb 26 2017 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

త్వరలో భద్రాద్రికి సీఎం రాక ! - Sakshi

త్వరలో భద్రాద్రికి సీఎం రాక !

రెండురోజులపాటు పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రూ.100 కోట్ల పనులకు అంకురార్పణ చేయనున్న కేసీఆర్‌


సాక్షి, కొత్తగూడెం:
వివిధ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధి ప్రధానాంశంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన సీఎం వీటికి సంబంధించి ఆ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ఆధ్యాత్మికపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.

ఇందుకోసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామిని ఇటీవల  భద్రాచలం పంపించి ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన నిర్మాణ చర్యలను సూచించాల్సిందిగా కోరారు. దీంతో ఫిబ్రవరి 1న చినజీయర్‌ స్వామి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో భద్రాచలం చేరుకుని దేవాలయంలో చేపట్టాల్సిన నిర్మాణాలు, ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంజనీరింగ్‌ అధికారులకు, వేద పండితులకు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇప్పటికే రెండుసార్లు దాదాపు ఖరారై వాయిదా పడగా, ఇక ఈసారి మాత్రం మార్చి మొదటి వారంలో దాదాపు ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశంలో తాను త్వరలో జిల్లాలో పర్యటించి రెండురోజులపాటు అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని స్వయంగా సీఎం చెప్పడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. జనవరి చివరివారంలో ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం అదే సమయంలో భద్రాద్రి జిల్లాకు సైతం వస్తారని భావించినా, సమయాభావం, ఇతర కారణాల వల్ల అప్పుడు సీఎం పర్యటన ఖరారు కాలేదు. జిల్లాకు రావాలని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని సీఎంను వ్యక్తిగతంగా కలిసిన కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావు ఇప్పటికే కోరారు. జిల్లా పర్యటనలో భాగం గా కొత్తగూడెంలో సీఎం ఒకరోజు బసచేసే విధంగా షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్‌ 5న శ్రీరామనవమి ఉన్నందున భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి రావాల్సి ఉంది. అయితే ఆ సందర్భంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో శ్రీరామనవమికి ముందే జిల్లాలో పర్యటించి భద్రాచలం దేవాలయ అభివృద్ధికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 7 లేదా 8 తేదీల్లో సీఎం పర్యటన దాదాపు ఖరారయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, సీఎం చేత ఏయే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించాలన్న అంశాలపై జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అలాగే అశ్వారావుపేట నియోజకవర్గంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలమైన దమ్మపేటలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ దాదాపు పూర్తయింది. దీని ప్రారంభానికి వస్తానని గతంలోనే ఆయిల్‌పాం రైతులకు సీఎం భరోసా ఇచ్చారు.

దీంతో మార్చి మొదటివారంలో సీఎం పర్యటనలోనే ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సైతం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తన పర్యటనలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉండటంతో జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులకు భూసేకరణ వేగవంతం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి పురోగతిని సీఎం సమీక్షించే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement