ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎంతో చారిత్రక ప్రాశస్త్యమున్న భద్రాచలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ఈ ఏడాదే రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యాదాద్రి, వేములవాడ తరహాలో అక్కడ పనులు చేపడతామని చెప్పారు. శుక్రవారం భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అనంతరం ఇక్కడి టుబాకో బోర్డు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీతారాముల కల్యాణం బ్రహ్మాండం గా జరిగింది. భద్రాచలం ప్రఖ్యాత, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పుణ్యక్షేత్రం. యాదగిరిగుట్టను ఆగమశాస్త్రం ప్రకారం జీయర్‌స్వామి సూచనలతో, వేములవాడను శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యుల పరిశీలనలో అభివృద్ధి చేస్తున్నాం. భద్రాద్రిని కూడా చినజీయర్‌స్వామి సూచనలతో సమగ్రాభివృద్ధి చేస్తాం.
ఇందుకు రూ.100 కోట్లను ఈ బడ్జెట్‌లోనే కేటాయించనున్నాం’’ అని చెప్పారు. గూగుల్ మ్యాప్‌లో భద్రాచలం ఆలయం, గోదావరి పరీవాహక ప్రాంతం చూశానని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు శిథిలావస్థలో ఉన్నాయని... ఆలయ లోపలి భాగాలు, పార్కింగ్ వీటన్నింటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలో చినజీయర్‌స్వామితో వచ్చి ఒకటిన్నర రోజు ఉండి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తామని తెలిపారు. ఆలయ సమీపంలో ఉన్న రంగనాయకుల గుట్ట అభివృద్ధితో పాటు జటాయువు, పర్ణశాల ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. పర్ణశాలలో 10 ఎకరాల స్థలం ఉందని, ఇక్కడ సీతాదేవి వనంలో నివసించిన గుర్తులు ఉన్నాయని చెప్పారు. వీటి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని.. పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఖమ్మంను సస్యశ్యామలం చేస్తాం..
ఖమ్మం జిల్లాకు రెండు సాగునీటి ప్రాజెక్టులు మంజూరు ఇస్తే... కొంతమంది అవగాహన రాహిత్యంతో వీటిపై విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ జిల్లా 100 శాతం సస్యశ్యామలం అవుతుందని, నాలుగేళ్లలో ఖమ్మంలో ఇంచుభూమి మిగలకుండా సాగుయోగ్యం చేస్తామని చెప్పారు. గిరిజనులు పోడు భూముల సమస్యను ఎదుర్కొంటున్నారని, ఈ అంశంపై ఢిల్లీకి వెళ్లి పర్యావరణ శాఖతో కూడా మాట్లాడానని తెలిపారు. ఏవో కొన్ని సంఘాలు ప్రపంచంలో వాళ్లే చాంపియన్లని అనిపించుకోవడం కోసం ఫ్యాషన్ ఉద్యమాలు చేస్తున్నాయని విమర్శించారు. ఖమ్మం జిల్లా గోదావరి, కృష్ణా బేసిన్ల మధ్య ఉందని.. నూతన ప్రాజెక్టులతో జిల్లా అంతటికీ సాగునీరు అందుతుందని చెప్పారు.
ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాం
తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లిన ఏడు గ్రామాల్లో భద్రాచలం సమీపంలోని 4గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తెచ్చే లా ఏపీ సీఎంతో మాట్లాడానని... దీనికి ఆయన అంగీకరించారని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘ఇచ్చి పుచ్చుకునే ధోరణితో మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఏపీ ప్రభుత్వానికి ప్రయోజనమేమీ ఉండదు. మహారాష్ట్రతో ఇటీవల సయోధ్య కుదుర్చుకున్నాం. ఇదే రీతిలో ఏపీ ఉండాలి’’ అన్నారు. గోదావరిలో దుమ్ముగూడెం కింద ఉన్న నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవచ్చన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సు మారు 1,000 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని.. ఇంకా 1,500 టీఎంసీ ల వరకూ సముద్రంలోకి వృథాగా పోతున్నాయని తెలిపారు.
వాటిని వినియోగించుకోవడం ద్వారా తెలుగు బిడ్డలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తమకు ఉందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని... నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కూడా ఈ ప్రాజెక్టును ప్రశంసించారన్నారు. ఈ పథకా న్ని మోడల్‌గా తీసుకోవాలని అందరు సీఎంలకు లేఖ రాశారన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, సీతారాంనాయక్, ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య పాల్గొన్నారు.
భద్రాద్రికి రూ.100 కోట్లు
Published Sat, Apr 16 2016 2:39 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement