హోదాతోనే సీఎం తిరిగిరావాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు హోదా, విభజన చట్టంలోని హామీల సాధనతో తిరిగి రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరస దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో సాగనంపుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులచే రాజీనామా చేయించి, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీక్షలో సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు, ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.