ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 6 లేదా 7వ తేదీ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కోనశశిధర్ తెలిపారు.
ఆగస్టులో సీఎం పర్యటన : కలెక్టర్
Published Wed, Jul 20 2016 11:59 PM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 6 లేదా 7వ తేదీ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కోనశశిధర్ తెలిపారు. ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి బుక్కరాయసముద్రం – నార్పల రోడ్డులోని కేజీబీవీ ముందున్న మైదానాన్ని హెలిప్యాడ్, బహిరంగ సమావేశం ఏర్పాట్ల కోసం కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీఓ) రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక సమాచారం అందిందన్నారు.
శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం (రేకులకుంట) సమీపంలో ఎఫ్‌పీఓ రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవం నిర్వహిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ జైలు ప్రాంతాన్ని, దేవరకొండ సమీపంలో మరో ప్రాంతాన్ని హెలిప్యాడ్, బహిరంగ సమావేశం నిర్వహణకు స్థల పరిశీలన చేశామన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవి సుకన్యను ఆదేశించారు.
Advertisement
Advertisement