కలెక్టరేట్ ‘న్యాక్’లో వద్దు
Published Mon, Aug 29 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరెట్ కార్యాలయాన్ని న్యాక్ భవనంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, మరోసారి పరిశీలించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాక్ భవనం జగిత్యాలకు 10కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు రహదారి సౌకర్యం సరిగ్గా లేదన్నారు. అంతేకాకుండా న్యాక్ విద్యార్థులకు సైతం ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ధరూర్ క్యాంపులో సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉందని, అక్కడ ఉన్న క్వాటర్స్‌లోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని వివరించారు. ఎస్సారెస్పీ సర్కిల్ ఆఫీసులోనే 200 మంది వరకు విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరోసారి ఆలోచించి కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వాటర్లలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement