Published
Sat, Jul 30 2016 12:37 AM
| Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
వైద్యుల డుమ్మాపై కలెక్టర్ మండిపాటు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
బయట పడిన గైర్హాజరు
నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు ఆదేశం
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరు బయటపడింది. శుక్రవారం కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆకస్మికంగా తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. బయోమెట్రిక్ విధానం ఉన్నా వైద్యులు గైర్హాజరు కావడంతో కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యాధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. బయెమెట్రిక్ ద్వారా అటెండెన్స్ విధానం సక్రమంగా లేదని, వైద్యులు గైర్హాజరు కావడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రకుమార్‌పై మండిపడ్డారు. గైర్హాజరైన వైద్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సరైన పర్యవేక్షణ లేదని అలాంటప్పుడు ఎవరికోసం ఈ బయెమెట్రిక్ విధానం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇంత పెద్ద భవనం నిర్మించి రోగులకు వైద్యసేవలు అందించకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. కలెక్టర్ తనిఖీ సమయంలో నలుగురు వైద్యులు గైర్హాజరయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న ఉద్యోగులకు, వైద్యులకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రోజు వారీగా క్రమం తప్పకుండా హాజరును పరిశీలించి వివరాలను అందించాలని ఆదేశించారు. నెల రోజుల పాటు హాజరు వివరాలను ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలోని పిల్లల వార్డు, జనరల్ వార్డు, ప్రసూతి వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆర్థో వార్డులో ధర్పల్లికి చెందిన సృజన అనే బాలిక తన తండ్రికి నడుము ఎముక విరిగిందని ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేలా చూడాలని కోరగా కలెక్టర్ ఆస్పత్రి వైద్యుడు బన్సీలాల్‌ను మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గైనిక్‌వార్డులో ఒకే బాత్‌రూమ్ ఉండడం సరిపోదని మరొకటి అదనంగా నిర్మించాలని సూచించారు. పిల్లల వార్డులో సౌకర్యాలపై పరిశీలించారు. వైద్యాధికారులు నిర్ణీత సమయంలో విధులకు హాజరై రోగుల నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానం సక్రమంగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తిరుపతిరావు, బన్సీలాల్, రజనీకాంత్ తదితరులున్నారు.