governmant
-
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
దేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లేన్ రూపొందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.రోడ్డుపై అన్ని రకాల వాహనాలు ఏకకాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు లేన్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం ద్విచక్ర వాహనాలతో ముడిపడినవే ఉంటున్నాయి.రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం 2022 లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,43,366 మంది గాయపడ్డారు.గత ఏడాది దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. -
‘హజ్ సువిధ’లో 10 భాషల్లో హజ్ యాత్ర సమాచారం!
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ‘హజ్ సువిధ’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ యాప్ హాజీలకు అవసరమైన సమయాల్లో సమీపంలోని ఆరోగ్య సదుపాయాలను గుర్తించడంలోనూ సహాయపడుతుందని ఆమె తెలిపారు. ‘హజ్ సువిధ’యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను స్మృతి ఇరానీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, వారి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. హజ్ 2024 కోసం ‘హజ్ గైడ్’ 'హజ్ సువిధ’ యాప్‌లను ఆవిష్కరించాం. 2024లో హజ్‌కు వెళుతున్న భారతీయులకు శుభాకాంక్షలు’ అని స్మృతి ఇరానీ ఆ పోస్టులో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, బెంగాలీతో సహా మొత్తం 10 భాషల్లో ఈ ‘హజ్ గైడ్’ అందుబాటులో ఉండనుంది. 'హజ్ సువిధ’ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్‌తో నేరుగా కమ్యూనికేషన్ అందుకోవచ్చు. ట్రాకింగ్ సిస్టమ్, వస్తువుల భద్రతకు సంబంధించిన సహాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. समन्वय, सुगमता और बढ़ता विश्वास!🕋 देश के यशस्वी पीएम @narendramodi जी के नेतृत्व में, हज यात्रा पर जाने वाले भारतीयों को बेहतर सुविधा प्रदान करने एवं उनके लिए यात्रा सरल, सुखद एवं सुरक्षित बनाने की दिशा में @MOMAIndia ने एक अहम प्रगति की है। हज 2024 हेतु आज विज्ञान भवन, नई… pic.twitter.com/jV1LyhEKhz — Smriti Z Irani (@smritiirani) March 3, 2024 -
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
‘రామాలయం’ సమీపాన ఆ రాష్ట్ర భవనం!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన దరిమిలా దేశ, ప్రపంచ మ్యాప్‌లో ఈ నగరానికి ప్రాధాన్యత మరింతగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ తమ రాష్ట్రంలోని భక్తులకు అయోధ్యలో సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యింది. అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించేందుకు గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో భూమిని కొనుగోలు చేసింది. సమీప భవిష్యత్తులో భవన నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. గుజరాత్ ప్రజలు పెద్ద సంఖ్యలో తీర్థయాత్రలకు తరలి వెళుతుంటారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని రామాలయాన్ని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అటువంటి పరిస్థితిలో తమ రాష్ట్ర పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేశ్ పటేల్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామభక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందని, గుజరాతీలకు చక్కని సౌకర్యాలు అందించేలా సమీప భవిష్యత్తులో అత్యుత్తమ భవనాన్ని నిర్మిస్తామన్నారు. కాగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతాతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ‘గుజరాత్ భవన్’లను నిర్మించారు. వీటిలో గుజరాతీ ప్రజలకు రాయితీ ధరలకు వసతి సౌకర్యాలు అందిస్తుంటారు. -
నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?
అది 2008.. నవంబర్ 26.. ముంబైలోని శివాజీ టెర్మినస్ స్టేషన్.. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు జనం మధ్య విధ్వంసం సృష్టించారు. రైల్వేస్టేషన్లో ఉగ్రవాదులు దాదాపు 50 మందిని హతమార్చారు. ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండ ముగిశాక.. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక దేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ బాలిక పేరు దేవిక రోత్వాన్. దాడి జరుగుతున్న సమయంలో ఆమె శివాజీ టెర్మినస్‌లో ఉంది. నాటి దాడిలో ఆమె కాలికి గాయమైంది. కోర్టులో కసబ్‌ను గుర్తించిన అతి పిన్న వయస్కురాలు దేవిక. ఆ సమయంలో ఆ చిన్నారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫొటోలో ఆ చిన్నారి ఊత కర్రల సాయంతో కోర్టుకు చేరుకున్న ఫొటో ఉంది. అయితే దేవిక జీవితం ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమెకు ఇప్పుడు 24 ఏళ్లు. జనం ఆమెను గుర్తుంచుకుని, కలుసుకునేందుకు వస్తుంటారు. దేవిక కుటుంబానికి గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.13 లక్షల పరిహారం అందింది. ప్రస్తుతం దేవిక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆమె తండ్రికి కూడా ఎక్కడా ఉద్యోగం లభించడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న ఇల్లు కోసం ఆమె ఎదురుచూస్తోంది. గతంలో దేవిక కుటుంబం ముంబైలోని చాల్లో ఉండేది. అయితే ఆమెకు పునరావాసం కల్పించడంలో భాగంగా వారి కుటుంబానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆమె రూ.19 వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేవిక తాను పోలీసు అధికారిని కావాలని ఆశపడుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె గత కొంత కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. తాను ఐపీఎస్ అధికారిగా మారాక ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని దేవిక మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు! -
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్ కంపెనీల కీలక చర్యలు -
అత్యాచార బాధితురాలిపై శివరాజ్ సర్కార్ నిర్లక్ష్యం
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల క్రితం అత్యాచారానికి గురై, రక్తంతో తడిసిన దుస్తులతో రోడ్డుపై తిరుగుతూ, తనను కాపాడాలంటూ పలువురి ఇంటి తలుపులు తట్టిన యువతి ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉజ్జయిని పోలీసులు రంగంలోకి దిగి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని, అతనికి సహాయం అందించిన వ్యక్తిని పట్టుకున్నారు. అయినా న్యాయం ఆమెకు అందనంత దూరంలో ఉంది. ఈ ఘటన తర్వాత శివరాజ్ సర్కార్ బాధితురాలిని ఆదుకుంటామని పలు వాగ్దానాలు చేసింది. ఇప్పుడు బాధితురాలు తన ఇంటిలోనే ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అయితే ప్రభుత్వ వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. తాజాగా ఒక మీడియా బృందం ఉజ్జయినికి 700 కిలోమీటర్ల దూరంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడి పరిస్థితులు పరిశీలించనప్పుడు అనేక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉజ్జయినిలో ఒక ఆటోడ్రైవర్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు దీనంగా తనను కాపాడాలంటూ కనిపించినవారినందరినీ వేడుకుంది. ఒక సన్యాసి ఆమెకు సహాయం అందించాడు. అనంతరం బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు అక్టోబర్ 12న తన ఇంటికి చేరుకుంది. నెల రోజులు దాటినా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి ఒక పూరిగుడిసెలో నివసిస్తోంది. భయంభయంగానే కాలం వెళ్లదీస్తోంది. బాధితురాలి ఇంట్లో ఇప్పటికీ మట్టి పొయ్యినే వినియోగిస్తున్నారు. తాగునీటి కోసం 300 మీటర్ల దూరంలోని కుళాయి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వస్తుంటుంది. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి చెందినది. బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ తాము తక్కువ కులానికి చెందిన వారమని, తమ మాట వినేవారే లేరని వాపోయాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంత బీజేపీ నేత సురేంద్ర సింగ్ గరేవార్ వారి ఇంటికి వచ్చి, రేషన్ సరుకుల కోసమంటూ రూ. 1500 రూపాయలు ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు నెలకు రూ. 600 చొప్పున సామాజిక న్యాయ పింఛను అందుతుందని బాధిత కుటుంబం తెలిపింది. నెల రోజుల క్రితం చావుబతుకుల మధ్య పోరాడిన బాధితురాలు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత -
ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వాలని ప్రవాస భారతీయులకు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే ప్రధాని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులవల్లేనని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడటం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ (ఓఎఫ్ఓబీ) ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. ప్రవాస భారతీయులు ఎన్నికల సమయంలో కచ్చితంగా కనీసం 15 రోజుల సమయమైనా వెచ్చించి దేశానికి రావాలని కోరారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడంతోపాటు పేదలకు పక్కా గృహ సదుపాయం, నిరక్షరాస్యత నిర్మూలన, ఉన్నత విద్యావ్యాప్తితోపాటు తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పెద్ధ ఎత్తున నిర్మించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్ఓబీ జాతీయ పూర్వ అధ్యక్షులు), ప్రవాస భారతీయులు విలాస్ రెడ్డి, జంబుల సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రదీప్ రెడ్డి కట్ట పాల్గొన్నారు. -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్‌కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..!
యూపీలోని యోగీ సర్కారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శనివారం(ఈరోజు) సెలవును రద్దుచేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రారంభమయ్యే అఖిల భారత విద్యా సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోగీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలలు తెరుచుకున్నాయి. జాతీయ విద్యావిధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా 29న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత విద్యా సమాఖ్య కార్యక్రమాన్ని యూపీలోని పాఠశాలలో ప్రసారం చేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూపీ డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ప్రధానమంత్రి అఖిల భారత విద్యా సమాగమం ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌ను పాఠశాల స్థాయి వరకు వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సెషన్లో పాల్గొనే వారి వివరాలను నేటి సాయంత్రంలోగా విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. తరువాత దానిని రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్ బాల్స్.. మారుత్ డ్రోన్స్ ఒప్పందం
ఆగ్రా/ఫిరోజాబాద్: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్ బాల్స్‌ను వెదజల్లింది. తమ సీడ్కాప్టర్స్ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. వృక్షారోపణ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ముందుగానే జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శనివారం ఇవ్వాల్సిన జీతాలను దసరా పండుగను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. దీంతో కార్మికులలో సంతోషం వ్యక్తమైంది. కార్మికులకు ముందుగానే జీతాలు ఇవ్వడానికి కృషిచేసిన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు, రాష్ట్ర కార్యదర్శులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వైద్యుల డుమ్మాపై కలెక్టర్ మండిపాటు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ బయట పడిన గైర్హాజరు నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు ఆదేశం నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరు బయటపడింది. శుక్రవారం కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆకస్మికంగా తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. బయోమెట్రిక్ విధానం ఉన్నా వైద్యులు గైర్హాజరు కావడంతో కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టర్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యాధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. బయెమెట్రిక్ ద్వారా అటెండెన్స్ విధానం సక్రమంగా లేదని, వైద్యులు గైర్హాజరు కావడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్రకుమార్‌పై మండిపడ్డారు. గైర్హాజరైన వైద్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సరైన పర్యవేక్షణ లేదని అలాంటప్పుడు ఎవరికోసం ఈ బయెమెట్రిక్ విధానం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇంత పెద్ద భవనం నిర్మించి రోగులకు వైద్యసేవలు అందించకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు సక్రమంగా విధులకు హాజరుకాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. కలెక్టర్ తనిఖీ సమయంలో నలుగురు వైద్యులు గైర్హాజరయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న ఉద్యోగులకు, వైద్యులకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రోజు వారీగా క్రమం తప్పకుండా హాజరును పరిశీలించి వివరాలను అందించాలని ఆదేశించారు. నెల రోజుల పాటు హాజరు వివరాలను ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలోని పిల్లల వార్డు, జనరల్ వార్డు, ప్రసూతి వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆర్థో వార్డులో ధర్పల్లికి చెందిన సృజన అనే బాలిక తన తండ్రికి నడుము ఎముక విరిగిందని ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేలా చూడాలని కోరగా కలెక్టర్ ఆస్పత్రి వైద్యుడు బన్సీలాల్‌ను మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గైనిక్‌వార్డులో ఒకే బాత్రూమ్ ఉండడం సరిపోదని మరొకటి అదనంగా నిర్మించాలని సూచించారు. పిల్లల వార్డులో సౌకర్యాలపై పరిశీలించారు. వైద్యాధికారులు నిర్ణీత సమయంలో విధులకు హాజరై రోగుల నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానం సక్రమంగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తిరుపతిరావు, బన్సీలాల్, రజనీకాంత్ తదితరులున్నారు.