ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల క్రితం అత్యాచారానికి గురై, రక్తంతో తడిసిన దుస్తులతో రోడ్డుపై తిరుగుతూ, తనను కాపాడాలంటూ పలువురి ఇంటి తలుపులు తట్టిన యువతి ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉజ్జయిని పోలీసులు రంగంలోకి దిగి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని, అతనికి సహాయం అందించిన వ్యక్తిని పట్టుకున్నారు. అయినా న్యాయం ఆమెకు అందనంత దూరంలో ఉంది.
ఈ ఘటన తర్వాత శివరాజ్ సర్కార్ బాధితురాలిని ఆదుకుంటామని పలు వాగ్దానాలు చేసింది. ఇప్పుడు బాధితురాలు తన ఇంటిలోనే ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అయితే ప్రభుత్వ వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. తాజాగా ఒక మీడియా బృందం ఉజ్జయినికి 700 కిలోమీటర్ల దూరంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడి పరిస్థితులు పరిశీలించనప్పుడు అనేక విషయాలు వెలుగు చూశాయి.
ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉజ్జయినిలో ఒక ఆటోడ్రైవర్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు దీనంగా తనను కాపాడాలంటూ కనిపించినవారినందరినీ వేడుకుంది. ఒక సన్యాసి ఆమెకు సహాయం అందించాడు. అనంతరం బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు అక్టోబర్ 12న తన ఇంటికి చేరుకుంది. నెల రోజులు దాటినా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు.
బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి ఒక పూరిగుడిసెలో నివసిస్తోంది. భయంభయంగానే కాలం వెళ్లదీస్తోంది. బాధితురాలి ఇంట్లో ఇప్పటికీ మట్టి పొయ్యినే వినియోగిస్తున్నారు. తాగునీటి కోసం 300 మీటర్ల దూరంలోని కుళాయి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వస్తుంటుంది. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి చెందినది. బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ తాము తక్కువ కులానికి చెందిన వారమని, తమ మాట వినేవారే లేరని వాపోయాడు.
బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంత బీజేపీ నేత సురేంద్ర సింగ్ గరేవార్ వారి ఇంటికి వచ్చి, రేషన్ సరుకుల కోసమంటూ రూ. 1500 రూపాయలు ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు నెలకు రూ. 600 చొప్పున సామాజిక న్యాయ పింఛను అందుతుందని బాధిత కుటుంబం తెలిపింది. నెల రోజుల క్రితం చావుబతుకుల మధ్య పోరాడిన బాధితురాలు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
Comments
Please login to add a commentAdd a comment