కలెక్టర్ సీరియస్!
ఎల్‌ఈడీ లైట్ల అక్రమాలపై ఆరా!
డీపీఓ నుంచి వివరాల సేకరణ
సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశం
పత్రికలకు డీపీఓ వివరణ విడుదల
విజయనగరం కంటోన్మెంట్: పంచాయతీలకు ఎల్‌ఈడీ లైట్ల సరఫరా విషయంలో ఐలైట్ సంస్థ అక్రమాలపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. వరుసగా వస్తున్న సాక్షి కథనాలను ఆధారంగా చేసుకుని జిల్లా పంచాయతీ అధికారిని ఆరా తీశారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా... దీనిపై పత్రికలకు వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. అయితే ఆయన ఇచ్చిన వివరణలో సందేహాలను నివత్తి చేసే అంశాలు లేకపోవడం విశేషం.
అక్రమమని తేలినా...
ఎంపీ ల్యాడ్స్ నిధులతో గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకోసం జిల్లా అధికారులు వరుసగా మూడేళ్లపాటు ఐలైట్ సంస్థకు అవకాశం కల్పించారు. ఆ సంస్థ ఒక్కో ఏడాది ఒక్కో ధరకు సరఫరా చేస్తున్నా... జిల్లా అధికారులు ఎంచక్కా బిల్లులు చెల్లించేశారు. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సాక్షాత్తూ జిల్లా పరిషత్ సీఈఓ విచారణలో తేలినా చర్యలు మాత్రం తీసుకోలేదు. పైగా గత కలెక్టర్ ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించినప్పటికీ దానిని పట్టించుకోకుండా... మళ్లీ అదే సంస్థకు అనుకూలంగా అధికారులు వ్యవహరించడం వెనుకనున్న ఒత్తిళ్లపై సాక్షి వరుసగా కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డీపీఓ సత్యనారాయణ రాజును పిలిచి వివరాలు తెలుసుకున్నారని తెలిసింది. అసలేం జరిగిందన్న దానిపై డీపీఓను ప్రశ్నించిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారని తెల్సింది.
మొదటినుంచీ అస్పష్ట సమాధానాలే...
వరుసగా వస్తున్న కథనాలపై మొదటినుంచీ జిల్లా పంచాయతీ అధికారి అస్పష్ట సమాధానాలే ఇస్తూ వచ్చారు. ఐలైట్ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని పరిశ్రమల అధికారికి గత కలెక్టర్ రాసిన లేఖ గురించి తనకు తెలియదని చెప్పారు. గతంలో గంట్యాడ మండలం బుడతనాపల్లిలో ఐలైట్ సంస్థ అమర్చిన వీధిలైట్ల నాణ్యతాలోపం, అక్రమాలపై ఆ గ్రామ సర్పంచ్ లోకాయుక్తను ఆశ్రయించిన సంగతి విదితమే! మరి ఈ లైట్లను అమర్చింది ఈ సంస్థేనని తెలియదా? దీనికి సంబంధించిన రికార్డులు కార్యాలయంలో ఉండవా? అలాగే ఆ సంస్థకు ప్రామాణిక ధ్రువపత్రాలు ఉన్నాయా లేవానన్నదీ చూడలేదా? టెండరు ఖరారు చేసుకున్న వ్యక్తితో పాటు ఎక్కువ ధరకు కోట్ చేసిన ఈ సంస్థకూ కాంట్రాక్టు సర్దుబాటు చేయడంలోగల ఆంతర్యమేమిటి? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే.
టెండరు ధరకు ఇస్తామన్నందునే...
జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు పిలిచిన టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన మాన్వితా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ధరలకే ఇస్తామన్నందున ఐలైట్ సంస్థకు కూడా కాంట్రాక్టును సర్దుబాటు చేశామని జిల్లా పంచాయతీ అధికారి ఎస్.సత్యనారాయణ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఓఎస్‌డీకి, ఇతర అధికారులకు సంబంధం లేదన్నారు. అలాగే ఐలైట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు తమ కార్యాలయంలో ఏ విధమయిన సమాచారం లేదని డీపీఓ పేర్కొన్నా... తరువాత ఆ లేఖ దొరికిందనీ... దానిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని రాత్రి ప్రత్యేకంగా సాక్షికి ఫోన్ చేసి తెలిపారు.