కలెక్టర్‌ ప్రకటన బాధ్యతారాహిత్యం | collector statement very bad | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ప్రకటన బాధ్యతారాహిత్యం

Published Mon, Sep 19 2016 10:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

కలెక్టర్‌ ప్రకటన బాధ్యతారాహిత్యం - Sakshi

కలెక్టర్‌ ప్రకటన బాధ్యతారాహిత్యం

  • నాటు సారా తగడం వల్లనే కాళ్లు వాచాయనడం ఘోరం
  • ఎమ్మెల్సీ బోస్,  వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల ధ్వజం
  • జీజీహెచ్‌లో కాళ్ళవాపు వ్యాధి బాధితులకు పరామర్శ
  • జిల్లాలో ఆరోగ్య పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట
  • కాకినాడ సిటీ : 
    అంతుచిక్కని కాళ్ళవాపు వ్యాధిపై కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని  వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. సోమవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కాళ్ళవాపు వ్యాధితో చికిత్స పొందుతున్న గిరిజనులను వైఎస్సాఆర్‌ సీపీ నేతలు పరామర్శించారు. ఆసుపత్రిలోని ఈఎన్‌టీ విభాగంలోని ప్రత్యేక వార్డులో ఉన్న 32 మంది బాధితులను పేరుపేరునా పలుకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో కన్నబాబు, బోస్‌ మాట్లాడుతూ కాళ్ళవాపు వ్యాధి నాటుసారా తాగడం వల్ల వచ్చినట్టుగా కలెక్టర్‌ పేర్కొనడాన్ని ఖండిస్తున్నామన్నారు. 32 మంది బాధితుల్లో మహిళలు, విద్యార్థి, విద్యార్థినులున్నారని, అయితే చదువుకుంటున్న విద్యార్థులకు కూడా కాళ్ళవాపు వ్యాధి సోకిందని, వాళ్లుకూడా నాటుసారా తాగడం వల్లనే వచ్చిందా అంటూ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని నివేదికలు వచ్చిన తరువాత నిర్ధారణ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. జిల్లాలో వైద్యసేవల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిందని విమర్శించారు. ఒకేగ్రామంలో 28 మంది కాళ్ళవాపు వ్యాధి బారిన పడ్డారని ఈ వ్యాధి 12 సంవత్సరాల క్రితం కూడా వచ్చినట్టు వారు చెబుతున్నారన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని తక్షణం వ్యాధి మూలాలను గుర్తించే చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం సమంజసం కాదన్నారు. ముంపు మండలాల్లో మొబైల్‌ డయాగ్నెస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి సేకరించిన బ్లెడ్‌ శాంపిల్స్‌ రిపోర్టులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, తక్షణం విస్తృత వైద్యసేవలు అందించే చర్యలు తీసుకోవడమే కాకుండా జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, వ్యాదిభారిన పడి చనిపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ముంపు మండలాల పరిస్ధితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, విద్య తదితర అన్ని విషయాల్లో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పర్యవేక్షించే అధికారులు కరువయ్యారని విమర్శించారు. జిల్లా యువజన విభాగ అధ్యక్షులు అనంత ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఏజెన్సీ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. కాళ్ళవాపు వంటి వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కలెక్టర్‌ మాట్లాడడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్‌ సీపీ రాష్ట్ర ప్రచార కమిటి ప్రదానకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement