ఇంకెప్పుడో..?
- అటకెక్కిన కలెక్టరేట్ నూతన నిర్మాణం
- ఎక్కడ నిర్మించాలన్నదే సమస్య
- నగరం బయటనే నిర్మించాలన్న సీఎం..?
- మురుగుతున్న రూ.35 కోట్ల నిధులు
అనంతపురం అర్బన్ :
జిల్లా కలెక్టరేట్ నిర్మాణం అటకెక్కింది. జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.35 కోట్లు మంజూరై ఏడాది దాటింది. అయితే నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా కలెక్టరేట్ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతోనే ప్రక్రియ ముందుకు సాగడంలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ పిలిచి నెలలు గడుస్తున్నా ఇంకా స్థలం వ్యవహారం మాత్రం తేలడం లేదు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు బదులుగా కొత్తగా కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం ఉన్న భవనం పక్కనే నూతన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు రూ.27 కోట్లతో టెండర్ పిలిచారు.
తెరపైకి స్థల మార్పు
ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న స్థలం, దాని పక్కన ఉన్న ఓటీఆర్‌కి చెందిన కొంత స్థలం, కార్యాలయం వెనుకభాగంలో ఉన్న రాజేంద్ర మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన కొద్ది స్థలాన్ని తీసుకుని కలెక్టరేట్ నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఇంతతో స్థల మార్పు అంశం తెరపైకి వచ్చింది. కొత్తగా నిర్మించనున్న కలెక్టర్ కార్యాలయం నగరంలో కాకుండా నగరానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఏదేని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ పక్కనే కొత్త భవనం నిర్మించాలనే ప్రతిపాదనలకు బ్రేక్ పడిందని సమాచారం.
ఫైనలైజ్ కాని టెండర్
కలెక్టరేట్ నూతన భవన నిర్మాణాని కి రూ.35 కోట్లు మంజురై తే ఇందులో రూ.27 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచింది. ఇంత వరకు సాఫీగానే సాగింది. అయితే నెలలు గడుస్తున్నా టెండర్ ఫైనలైజ్ చేయలేదు. స్థల మార్పు వ్యవహారం కొలిక్కిరాని కారణంగానే ఈ ప్రక్రియ నిలిపేశారని సమాచారం.
టెండర్ అవార్డు కాలేదు : శ్రీనివాసమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్‌అండ్‌బీ
కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి రూ.27 కోట్లతో టెండర్లు పిలిచాము. అ యితే టెండర్‌ని ఇంకా అవార్డు చేయలేదు. ఫైనలైజ్ అయిన తరువాత పనులు ప్రనులు ప్రా రంభమవుతాయి.