ఉల్లాసంగా.. ఉత్సాహంగా
ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం
బుక్కరాయసముద్రం : రోటరీపురం సమీపాన గల శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) కళాశాల తొమ్మిదో వార్షికోత్సవం శనివారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. శ్రీసాయిబాబా నేషనల్ (ఎస్‌ఎస్‌బీఎన్) డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, సినీ నటి ప్రణీత, ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, చైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, సీఇఓ జగన్మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. సినీనటి ప్రణీత విద్యార్థులను ప్రోత్సహించడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వివిధ బ్రాంచ్‌లలో కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. మరింత బాగా చదువుకోవాలంటూ ముఖ్య అతిథులు ప్రోత్సహించారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఒక్క యువతతోనే సాధ్యమన్నారు.
విద్యార్థుల స్వాగతంతో ఎనర్జీ
అనంతపురం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సినీ నటి ప్రణీత అన్నారు. చాలా మంది విద్యార్థులు శుక్రవారం నుంచే ఫేస్‌బుక్‌లో తనకు స్వాగతం పలకడం సంతోషాన్ని, చాలా ఎనర్జీని ఇచ్చిందన్నారు. ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో 60 శాతం మందికి పైగా విద్యార్థినులు చదువుకుంటుండటం హర్షనీయమన్నారు.