‘శోభా’యమానం!
‘శోభా’యమానం!
Published Sat, Aug 20 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
పుష్కరాలు ఇంకా మూడు రోజులే!
మూడొంతులు పూర్తయిన మహా క్రతువు
చివరి రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం
సాక్షి, గుంటూరు : పుష్కరాలు మూడొంతులు పూర్తయ్యాయి. మహాక్రతువు ఇంకా మూడు రోజులే కొనసాగుతుంది. తొమ్మిది రోజుల్లో 45 లక్షల మంది భక్తులు జిల్లాలోని వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చివరి రోజుల్లో భక్తుల తాకిడి పెరిగే అవకాశముందని వారు భావిస్తున్నారు. జిల్లాలో ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రధానంగా అమరావతిలోని పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో తొమ్మిదోరోజైన శనివారం భక్తుల తాకిడి కొంత తగ్గింది. వారం రోజులుగా ఎండలు మండిపోతుండటం, ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేలా నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. అటు అధికారులు, ఇటు పుష్కరాలకు వచ్చిన భక్తులు ఎండ తాకిడికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
అధికారుల పరిశీలన...
అమరావతి పుష్కర ఘాట్‌లను శనివారం పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ శనివారం అమరావతిలోని పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. రెంటచింతల మండలం సత్రశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆర్డీ డాక్టర్ షాలినీదేవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజారాణి పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు నీరసించే అవకాశం ఉందని, అందుకు తగిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయపురిసౌత్‌లోని ఘాట్‌కు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. డ్యామ్‌పై నుంచి రాకపోకలను పోలీసులు సడలించడంతో తెలంగాణ వైపు నుంచి భక్తులు అధిక సంఖ్యలో కష్ణవేణి ఘాట్‌కు రావడంతో రద్దీ పెరిగింది. జిల్లాలోని అమరావతి, సత్రశాల, విజయపురి సౌత్‌లోని ఘాట్, తాళాయపాలెం, సీతానగరం ఘాట్‌లలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ఘాట్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి.
కొనసాగుతున్న ఇబ్బందులు...
జిల్లాలోని అనేక ఘాట్ల వద్ద పిండప్రదానం చేసే షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్లు సరిపోక భక్తుల ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల అధికారులు తాత్కాలికంగా టెంట్లు వేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో భక్తులకు ఉపయోగపడడం లేదు. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో భక్తులు, అధికారులు అల్లాడిపోయారు. అనేక ఘాట్ల వద్ద నీరు కలుషితం కావడంతో అధికారులు, భక్తులు వందల సంఖ్యలో విషజ్వరాలు, డయేరియా బారిన పడుతున్నారు. అధికారులు పుష్కర ఘాట్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడంలో వైద్య అధికారుల సూచనలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement