‘మరో జన్మ ఉంటే జిల్లాలోనే జన్మిస్తా’ | comedian actor gowtham raju interview | Sakshi

‘మరో జన్మ ఉంటే జిల్లాలోనే జన్మిస్తా’

Apr 27 2016 11:54 AM | Updated on Aug 20 2018 6:18 PM

‘మరో జన్మ ఉంటే జిల్లాలోనే జన్మిస్తా’ - Sakshi

‘మరో జన్మ ఉంటే జిల్లాలోనే జన్మిస్తా’

‘గోదావరి జిల్లాల ప్రజలకు అనుబంధం, ఆత్మీయత ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ఆత్మీయత, అనుబంధం దొరకదు. ఈ జిల్లావాసిని కావడం నా అదృష్టం.

నాటకరంగమే సినిమా రంగానికి పునాది   
 నవరసాలు పండించాలన్నదే నా లక్ష్యం  
 కామెడీ నటుడు గౌతంరాజు

 
 ‘గోదావరి జిల్లాల ప్రజలకు అనుబంధం, ఆత్మీయత ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి ఆత్మీయత, అనుబంధం దొరకదు. ఈ జిల్లావాసిని కావడం నా అదృష్టం. మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉంది’’ అని అన్నారు ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు. మంగళవారం రాయవరంలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..     
 
 పుట్టింది రాజోలులోనే..

 నేను పుట్టింది రాజోలైనా.. విద్యాభ్యాసం మాత్రం కాకినాడలోనే. కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం ఇంటర్మీడియేట్ బోర్డు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాను. సినీ రంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్కూల్ టైమ్ నుంచి నాటకాలంటే ఇష్టం. కాకినాడలో ఉండగా నాటకాలు వేశాను. దాదాపుగా 42 నాటక ప్రదర్శనలు వేశాను. పశ్చాత్తాపం, లాభం, ఏక్‌దిన్‌కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి తదితర నాటకాల్లో నటించాను.
 
 నాటకరంగం పునాది..
 నటులకు నాటకరంగం పునాదిరాయి వంటిది. ఎందరో మహానటుల్లానే.. నేనూ నాటకరంగం నుంచే సినిమా రంగానికి వెళ్లాను. సింగితం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన వసంతగీతం సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు  200కు పైగా సినిమాల్లో నటించాను. ఘరానామొగుడు, కూలీ నెం-1, ప్రేమకు వేళాయెరా! ఉగాది, తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. జైశ్రీరామ్ సినిమాలో తొలిసారిగా విలన్ వేషం వేశాను. వెయ్యి అబద్ధాలు సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.
 
 నవరసాలు పోషించాలని ఉంది..
 తెలుగులో పరాయి భాష విలన్‌లను తెచ్చుకోవడం అలవాటైంది. ఇక్కడ నటులున్నా ఎందుకో విలన్‌లు విషయంలో పరాయి నటులను తెచ్చుకుంటున్నారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాాయణ మాదిరిగా నవరసాలు ఉన్న పాత్రలు పోషించాలన్నదే నా ధ్యేయం. ముఖ్యంగా సెంటిమెంట్ ఉన్న క్యారక్టర్లు పోషించాలని ఉంది.
 
 విడుదలకు సిద్ధంగా తనయుడి సినిమా..
 మా అబ్బాయి పేరు కృష్ణంరాజు, కృష్ణ పేరుతో హీరోగా పరిచయం చేస్తున్నాం. ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’ సినిమాలో కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా నాలుగు భాషల్లో చేస్తున్నాడు. నా కుమారుడు కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో అనుకోకుండా హీరో అవకాశం వచ్చింది.
 
 అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి...
 తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రతి కమెడియన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఓ స్త్రీ సంకెళ్లు తెంచుకో’ సీరియల్‌లో హీరోగా నటించినందుకు బంగారు నంది గెల్చుకున్నాను. రాజబాబు అవార్డు, భరతముని అవార్డు, రేలంగి అవార్డు వచ్చింది. గజల్ ట్రస్ట్ అందించే నవ్వులరారాజు అవార్డును అందుకున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement