వాణిజ్య పన్నులశాఖ ఆదాయం డల్
Published Fri, Nov 25 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
* నోట్ల రద్దుతో డిసెంబర్‌లో ప్రభావం
* స్వైపింగ్ మిషన్ల పై సర్వీస్ ట్యాక్స్ సడలిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి
* వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
గుంటూరు (నగరంపాలెం): పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబరులో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. గుంటూరులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరులో రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు నోట్ల కొరత కారణంగా తగ్గిపోవటంతో డిసెంబరులో వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గిపోనుందన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రిటైల్ వ్యాపారులకు పీవోఎస్ మిషన్లు అందించే బాధ్యతను.. వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి ప్రభుత్వం అప్పగించిందన్నారు. కానీ స్వైపింగ్ మిషన్ల ద్వారా నగదు లావాదేవీలు చేయటంతో అదనంగా బ్యాంకులు వసూలు చేసే సర్వీస్ చార్జి కారణంగా రిటైల్ వ్యాపారస్తులు ముందుకు రావటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీవోఎస్ మిషన్ల ద్వారా జరిగే నగదు లావాదేవీలపై సర్వీస్ చార్జిని ఎత్తివేసి కనీస అద్దెను బ్యాంకులు వసూలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే నగదు ఇబ్బందుల నుంచి ప్రజలు, వ్యాపారస్తులు అధిగమిస్తారన్నారు.
Advertisement