నత్తతో పోటీ..! | compitition with snail | Sakshi
Sakshi News home page

నత్తతో పోటీ..!

Published Sun, Jul 17 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

నత్తతో పోటీ..!

నత్తతో పోటీ..!

– పూర్తికాని పుష్కర ఘాట్‌ పనులు
– మాస్టర్‌ప్లాన్‌ పనులూ అంతంతే
– నాణ్యత మరిచిన కాంట్రాక్టర్లు
– నిబంధనలు పట్టించుకోని అధికారులు
– నేడు సీఎం చంద్రబాబు పర్యటన
 
 
కష్ణా పుష్కరాలను ఘనంగా జరుపుతాం..పక్కా ప్రణాళికతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం.. 
–ప్రభుత్వ పెద్దల చెబుతున్న మాటలు ఇవీ.
ఇప్పటికీ పూర్తికాని పుష్కర ఘాట్లు..నాసిరకం పనులు.. హడావుడిగా అధికారుల పర్యటనలు..ముంచుకొస్తున్న పుష్కర ముహూర్తం..
– ఇదీ వాస్తవ పరిస్థితి.
 
సాక్షి, కర్నూలు: 
కష్ణా పుష్కర పనులు గడువులోగా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆగమేఘాలపై వీటిని పూర్తి చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. పనులు నత్తనడకన.. నాసిరకంగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలకు ఏడాదికి ముందే పక్కా ప్రణాళికతో పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కష్ణా పుష్కరాలను అంతకంటే ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు కానీ.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. హడావుడిగా పనుల మంజూరు.. నాణ్యతను వదిలేయడం..తదితర కారణాలతో  కోట్లాది రూపాయల ప్రజాధనం వథా అయింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం రానున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర పనులపై ప్రత్యేక కథనం.
 
 కష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూ. 166 కోట్లపైగా వెచ్చించింది. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల కోసం రూ. 24 కోట్లు కేటాయించింది.  ప్రధానంగా పుష్కరాల్లో స్నాన మాచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఘాట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కావాల్సి ఉన్నా కొత్తగా నిర్మిస్తున్న ఘాట్ల పనులు 60 శాతం కూడా పూర్తికాలేదు. ఈ పనులు మరో 13 రోజులు పూర్తికావడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఈ పనులు చేపట్టిన జలవనరులశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాతాళాగంగలో కొత్తగా చేపట్టిన పుష్కర ఘాట్‌ పనులు 50 శాతం దాటగా.. లింగాలగట్టు వద్ద నది మధ్యలో నిర్మిస్తున్న నూతన ఘాట్‌ పనులు మాత్రమే 60 శాతం చేరుకున్నాయి. అలాగే సంగమేశ్వరంలో హైలెవల్‌ ఘాట్‌కు ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఘాట్‌ పనులు కూడా 45 శాతం జరగడంతో.. మిగిలిన పనులు నిర్దేశించుకున్న సమయానికి పూర్తి చేస్తారా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 
నిబంధనలకు నీళ్లొదిలిన కాంట్రాక్టర్లు..
పుష్కరాలకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పుష్కర పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయితే పనులు చేపట్టేందుకు తగినంత సమయం లేకపోవడంతో ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా పనులు కానిచేస్తున్నారు. వీటిని అధికారులు ఎక్కడా అడ్డుకోకపోవడం గమనార్హం. కొత్తగా నిర్మిస్తున్న ఘాట్లకు సంబంధించి ప్రధానమైన కీవాల్‌ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ఇక పాత ఘాట్ల పునరుద్ధరణ పనుల్లో ఎక్కడా నాణ్యత కనిపించకపోవడం కాంట్రాక్టర్ల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు వీటిని సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం.. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
మాస్టర్‌ప్లాన్‌ పనుల్లోనూ.. 
శ్రీశైలం అభివద్ధిలో భాగంగా చేపడుతున్న మాస్టర్‌ప్లాన్‌  పనుల్లోనూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించకుండా పనులు మమ అనిపిస్తున్నారు. వీరికి ఇంజినీరింగ్‌ అధికారులు తోడవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ డ్రెయినేజీ, మంచినీటి సరఫరా పనుల్లో నాణ్యత గాలికొదిలేశారు. పుష్కరాలలోపు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎడాపెడా పనులు కానిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కానీ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగం కానీ అటువైపు చూసిన దాఖలాలు లేకపోవడంతో పుష్కర పనుల్లో పిండుకున్నోనికి పిండుకున్నంత అన్నట్లు సాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement