కాంగ్రెస్‌కు పునర్జన్మ లేదు
Published Wed, May 10 2017 12:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు : రాష్ట్రంలో కాంగ్రెస్ పర్టీ బతికి బట్ట కట్టే పరిస్థితే లేదని, ఆ పార్టీకి పునర్జన్మ లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. ఎన్నికల సమయంలో పార్టీల ప్రచారం కోసం నిందలు మోపడం సర్వసాధారణమని, కానీ రాజకీయ మనుగడ కోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు చేసి రాష్ట్రాభివృద్ధి కుంటు పడితే దాన్ని అస్త్రాలుగా చేసుకుని విషప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 106 చెరువులకు నీరు నింపే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.550 కోట్లతో అధికారులు డీపీఆర్ రూపొందించారని, ముఖ్యమంత్రికి నివేదించి నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement