డిచ్‌పల్లి పోలీసుల అదుపులో నాయకులు
ఆదిలాబాద్/మంచిర్యాల రూరల్ : మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలుపడానికి తరలి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చలో మల్లన్నసాగర్‌కు తరలి వెళ్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్‌జాదవ్, ఉపాధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్, ఏఐసీసీ కమిటీ సభ్యుడు కోటేష్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు మహమూద్‌ఖాన్, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షుడు మల్లేష్, నారాయణరెడ్డిలను డిచ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, షబ్బీర్‌అలీ తదితర నాయకులతో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఓబీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త సుంకి సత్యంలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో చర్చించి న్యాయపరంగా అందాల్సిన పరిహారం అందజేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.