hareeshrao
-
గజ్వేల్‌కు రైలు కూత
తూప్రాన్ సిద్ధిపేట : కొత్త సంవత్సరంలోగా గజ్వేల్‌కు రైలుకూత వినాలన్నదే టార్గెట్‌గా అధికారులు, నాయకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తూప్రాన్ మండలం రామాయపల్లి సమీపంలో 44వ నంబర్ రహదారిపై వందకోట్లతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనోహరాబాద్ –కొత్తపల్లి రైల్వేలైన్ మార్గం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. రైల్వే నిర్మాణం పనులకోసం వందశాతం భూసేకరణ ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ల కృషి ఫలితంగా భూసేకరణ త్వరగా పూర్తయిందన్నారు. రైల్వే నిర్మాణం పనులకోసం ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జీఎంఆర్ , నేషనల్హైవే అధికారులు, రైల్వే అధికారులతో చర్చించి రైల్వే పనులకోసం కృషి చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పనిని కూడా చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పదవులు కావాలి కానీ ప్రజల అవసరాలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రైల్వే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 30 కిలోమీటర్ల మేర మొదటి దశ పూర్తి చేసేందుకు పనులు సాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం 600 వేల కోట్లతో మంజూరైన రైల్వే నిర్మాణం పనులు ఎనిమిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో రూ.1,160 కోట్ల వ్యయం పెరిగిందిన్నారు. ఏనాడూ పట్టించుకోలేదు.. కేసీఆర్ పట్టుదల వల్ల మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే రైల్వే నిర్మాణం పనులు పూర్తి చేశామన్నారు. ఈ ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అలాగే రూ.5 కోట్లతో తూప్రాన్‌లో ఆర్అండ్బీ అతిథి గృహం, రూ.56 లక్షలతో ఆయుర్వేద ఆస్పత్రి, రూ.25కోట్లతో 500 డబుల్బెడ్రూమ్ ఇళ్లకు నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అంటే లంచం లేనిది ఇల్లు రాదు, బిల్లు రాదని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్ఎస్ పాలనలో పారదర్శకంగా అసలైన నిరుపేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. తూప్రాన్‌లో ఇప్పటికే మూడు మార్కెట్లు కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఇందులో గ్రేన్ మార్కెట్, వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్, వే సైడ్ మార్కెట్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదిలా ఉంటే టోల్‌ప్లాజా వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే పేద రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కోటి రూపాయలతో వే సైడ్ మార్కెట్‌ను నెలరోజుల్లో పూర్తిచేసి వారికి అందించే లక్ష్యంగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రైతులు పండించిన పంటల నిల్వ కోసం రూ.6 కోట్లతో మార్కెట్ సదుపాయం కల్పించేందుకు మార్కెట్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధికి చిరునామా అంటే గజ్వేల్, తూప్రాన్ అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి మీ ఆశీస్సులను కేసీఆర్‌కు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, జెడ్పీటీసీ సుమన, జీఎంఆర్ , నేషనల్ హైవే, రైల్వే శాఖల అధికారులతోపాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయంలో ఈనెల 31న నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలకు రావాలంటూ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావును అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధి, హనుమాన్ ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన్ని కలుసుకుని ఆహ్వానపత్రాన్ని ఇచ్చారు. -
కాంగ్రెస్ నాయకుల అరెస్టు
ఆదిలాబాద్/మంచిర్యాల రూరల్ : మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలుపడానికి తరలి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చలో మల్లన్నసాగర్‌కు తరలి వెళ్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్‌జాదవ్, ఉపాధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్, ఏఐసీసీ కమిటీ సభ్యుడు కోటేష్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు మహమూద్‌ఖాన్, జిల్లా కిసాన్‌సెల్ అధ్యక్షుడు మల్లేష్, నారాయణరెడ్డిలను డిచ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, షబ్బీర్‌అలీ తదితర నాయకులతో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఓబీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త సుంకి సత్యంలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో చర్చించి న్యాయపరంగా అందాల్సిన పరిహారం అందజేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ రిమ్స్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ భూ నిర్వసితులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ నిర్వసితులపై దాడి చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ తీరను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు కక్షపూరితంగానే నిర్వసితులపై దాడి చేయించారని ఆరోపించారు. నిర్వాసితులకు మంత్రి క్షమాపణ చెప్పాలని, లాఠీచార్జికి కారణమైన డీఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యుడు డి.మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు బొమ్మెన సురేష్, కె.అశోక్, మయూరిఖాన్, అగ్గిమల్ల స్వామి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జమున, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పూసం సచిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు కనక గణపతి పాల్గొన్నారు. -
భద్రాద్రి ముమ్మాటికీ మనదే
సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణకే చెందుతుందని, ఇక్కడ ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం సంపూర్ణమవుతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. భద్రాద్రిని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. టీజేఏసీ నియోజకవర్గ కన్వీనర్ సత్తయ్య యాదవ్, విద్యార్థి సంఘ నాయకులకు హరీష్‌రావు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్, భద్రాద్రి రెండు కళ్లలాంటివన్నారు. ఈ రెండింటిలో దేన్నీ వదులుకోవడానికి తెలంగాణ వారు సిద్ధంగా లేరన్నారు. సీమాంధ్ర నాయకులకు భద్రాద్రి రామునిపై కాని, ప్రజలపై కాని గవ్వంతైనా ప్రేమ లేదని కేవలం భద్రాద్రి డివిజన్లో పారే 180 కిలోమీటర్ల గోదావరి ప్రవాహం కోసమే వారి తాపత్రయమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గు నిక్షేపాలు, ఖనిజాలు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. భద్రాద్రిని సీమాంధ్రలో విలీనం చేస్తే మాకు భద్రత ఉండదంటూ స్థానిక ప్రజలే ఆందోళనలు చేయడం గమనించాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చాకే సంబరాలు చేసుకుంటామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే మీ తెలంగాణకే నష్టం అని సంబోధిస్తూ తాను సీమాంధ్ర ప్రాంతానికే చెందినవాడినని చెప్పకనే చెబుతున్నారన్నారు. కిరణ్ మూడేళ్ల పాలనలో ఆయన ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కిర ణ్సర్కార్ చిత్తూరుకు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏ ఒక్క పథకమూ అమలు కావడం లేదని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో ఆయన పరువు తీస్తోందన్నారు. సొంత పార్టీ నేతలే ఫ్లెక్సీలలో కిరణ్ బొమ్మను కత్తిరిస్తున్నారన్నారు. అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకంలో కిరణ్ బొమ్మలు తప్ప సరుకులు లేవని ఎద్దేవా చేశారు. అనంతరం దీక్షా శిబిరానికి హాజరైన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర సాధనతోనే ఉద్యమం ఆగిపోదని, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించేవరకు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగే పోరాటానికి ఎంపీజే సంపూర్ణ సంఘీభావం తెలుపుతుందన్నారు. ‘ప్రాణహిత’ కోసం వస్తే స్వాగతిస్తాం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తానంటే పూలమాలతో స్వాగతిస్తామని టీజేఏసీ పశ్చిమ జిల్లా కన్వీనర్ అశోక్‌కుమార్ అన్నారు. కాని తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడే సీమాంధ్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదన్నారు. నరైన్ ట్రస్ట్ అధినేత చాంగండ్ల నరేంద్రనాధ్ దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్, దళిత సంఘాల నాయకులు సంజీవయ్య, విద్యార్థి సంఘం నాయకులు మాదాసు శ్రీనివాస్, సదాశివపేట పార్టీ అధ్యక్షులు బాల్‌రెడ్డి, ఎంపీజే జిల్లా కోకన్వీనర్ అన్వర్లతో పాటు టీజేఏసీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరుకే సీఎం.. అల్లాదుర్గం రూరల్: కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకే సీఎం అని, రాష్ట్రానికి కాదని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సొంత జిల్లాకు రూ. 6 వేల కోట్లు మంజూరు చేసుకుని అనుయాయులకు ఫలహారంగా పంచిపెడుతున్నారని అన్నారు. అల్లాదుర్గం మండలం వట్‌పల్లిలోని వెంకటఖాజా దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా నీది చిత్తూరు, నాది చిత్తూరు అంటూ చంద్రబాబు, సీఎం కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే కిరణ్ ప్రభుత్వనికి చంద్రబాబు అండగా ఉండి కాపాడారని ఆయన తెలిపారు. ఇది టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు కుతుబొద్దిన్, అంజిరెడ్డి, చంద్రశేఖర్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు. -
మార్క్‌ఫెడ్ తెరిచారు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: స్థానిక మార్కెట్ యార్డులో నాలుగురోజులుగా మూతపడి ఉన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని అధికారులు బుధవారం తెరిచారు. అంతేకాదు కొనుగోళ్లు కూడా ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి తాళాలు వేసిన సంఘటనపై ‘సాక్షి’ బుధవారం ‘మూసేశారు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన యంత్రాగం ఉరుకుల పరుగుల మీద కేంద్రాన్ని తెరిచేలా ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుకూడా సాక్షి కథనంపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆయన జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ నాగమల్లికకు ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. సిద్దిపేట ప్రాంత రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడం సరికాదన్నారు. వెంటనే మర్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డీఎంకు సూచించారు. మరోవైపు స్థానిక మార్కెట్ కమిటీ, ఐకేపీ అధికారులతో మాట్లాడి వారిని మందలించారు. జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక కొనుగోలు కేంద్రం మూసివేసిన అంశంపై క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. హమాలీలకు బకాయిగా ఉన్న రూ. లక్ష రెండు రోజుల్లోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వెళ్లడించారు. దీంతో స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య హమాలీ నాయకులతో మాట్లాడి బుధవారం తూకాలు, ఎగుమతుల ప్రక్రియను పునఃప్రారంభించారు. బుధవారం మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులంతా ఆనంద ం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ‘సాక్షి’ చూపిన చొరవను వారంతా అభినందించారు.