గజ్వేల్‌కు రైలు కూత | Railway Station In Gajwel | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌కు రైలు కూత

Published Thu, Aug 30 2018 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 11:20 AM

Railway Station In Gajwel - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

తూప్రాన్‌ సిద్ధిపేట : కొత్త సంవత్సరంలోగా గజ్వేల్‌కు రైలుకూత వినాలన్నదే టార్గెట్‌గా అధికారులు, నాయకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తూప్రాన్‌ మండలం రామాయపల్లి  సమీపంలో 44వ నంబర్‌ రహదారిపై వందకోట్లతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనోహరాబాద్‌ –కొత్తపల్లి రైల్వేలైన్‌ మార్గం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు.  

రైల్వే నిర్మాణం పనులకోసం వందశాతం భూసేకరణ ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ల కృషి ఫలితంగా భూసేకరణ త్వరగా పూర్తయిందన్నారు. రైల్వే నిర్మాణం పనులకోసం ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జీఎంఆర్‌ , నేషనల్‌హైవే అధికారులు, రైల్వే అధికారులతో చర్చించి రైల్వే పనులకోసం  కృషి చేసినట్లు గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ పాలనలో ఏ ఒక్క పనిని కూడా చేయలేదని  తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పదవులు కావాలి కానీ ప్రజల అవసరాలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రైల్వే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 30 కిలోమీటర్ల మేర మొదటి దశ పూర్తి చేసేందుకు పనులు సాగుతున్నాయన్నారు.  ఈ ప్రాజెక్ట్‌ వ్యయం 600 వేల కోట్లతో మంజూరైన రైల్వే నిర్మాణం పనులు ఎనిమిదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడంతో రూ.1,160 కోట్ల వ్యయం పెరిగిందిన్నారు.

ఏనాడూ పట్టించుకోలేదు..

కేసీఆర్‌ పట్టుదల వల్ల మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు కేవలం రెండు  సంవత్సరాల కాలంలోనే రైల్వే నిర్మాణం పనులు పూర్తి చేశామన్నారు. ఈ ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. అలాగే రూ.5 కోట్లతో తూప్రాన్‌లో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, రూ.56 లక్షలతో ఆయుర్వేద ఆస్పత్రి, రూ.25కోట్లతో 500 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అంటే లంచం లేనిది ఇల్లు రాదు, బిల్లు రాదని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్‌ఎస్‌ పాలనలో పారదర్శకంగా అసలైన  నిరుపేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లను అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారన్నారు. తూప్రాన్‌లో ఇప్పటికే మూడు మార్కెట్లు కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. ఇందులో గ్రేన్‌ మార్కెట్, వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్, వే సైడ్‌ మార్కెట్‌ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే టోల్‌ప్లాజా వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే పేద రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకురాలు గీతారెడ్డి ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదన్నారు.  కోటి రూపాయలతో వే సైడ్‌ మార్కెట్‌ను నెలరోజుల్లో పూర్తిచేసి వారికి అందించే లక్ష్యంగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రైతులు పండించిన పంటల నిల్వ కోసం రూ.6 కోట్లతో మార్కెట్‌ సదుపాయం కల్పించేందుకు మార్కెట్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు.

అభివృద్ధికి చిరునామా అంటే గజ్వేల్, తూప్రాన్‌ అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి మీ ఆశీస్సులను కేసీఆర్‌కు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, జెడ్పీటీసీ సుమన, జీఎంఆర్‌ , నేషనల్‌ హైవే, రైల్వే శాఖల అధికారులతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement