సంగారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణకే చెందుతుందని, ఇక్కడ ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం సంపూర్ణమవుతోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. భద్రాద్రిని తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టారు. టీజేఏసీ నియోజకవర్గ కన్వీనర్ సత్తయ్య యాదవ్, విద్యార్థి సంఘ నాయకులకు హరీష్‌రావు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్, భద్రాద్రి రెండు కళ్లలాంటివన్నారు.
ఈ రెండింటిలో దేన్నీ వదులుకోవడానికి తెలంగాణ వారు సిద్ధంగా లేరన్నారు. సీమాంధ్ర నాయకులకు భద్రాద్రి రామునిపై కాని, ప్రజలపై కాని గవ్వంతైనా ప్రేమ లేదని కేవలం భద్రాద్రి డివిజన్‌లో పారే 180 కిలోమీటర్ల గోదావరి ప్రవాహం కోసమే వారి తాపత్రయమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గు నిక్షేపాలు, ఖనిజాలు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. భద్రాద్రిని సీమాంధ్రలో విలీనం చేస్తే మాకు భద్రత ఉండదంటూ స్థానిక ప్రజలే ఆందోళనలు చేయడం గమనించాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చాకే సంబరాలు చేసుకుంటామన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే మీ తెలంగాణకే నష్టం అని సంబోధిస్తూ తాను సీమాంధ్ర ప్రాంతానికే చెందినవాడినని చెప్పకనే చెబుతున్నారన్నారు.
కిరణ్ మూడేళ్ల పాలనలో ఆయన ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కిర ణ్‌సర్కార్ చిత్తూరుకు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏ ఒక్క పథకమూ అమలు కావడం లేదని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో ఆయన పరువు తీస్తోందన్నారు. సొంత పార్టీ నేతలే ఫ్లెక్సీలలో కిరణ్ బొమ్మను కత్తిరిస్తున్నారన్నారు. అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకంలో కిరణ్ బొమ్మలు తప్ప సరుకులు లేవని ఎద్దేవా చేశారు. అనంతరం దీక్షా శిబిరానికి హాజరైన ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో ముస్లింలు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర సాధనతోనే ఉద్యమం ఆగిపోదని, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించేవరకు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జరిగే పోరాటానికి ఎంపీజే సంపూర్ణ సంఘీభావం తెలుపుతుందన్నారు.
‘ప్రాణహిత’ కోసం వస్తే స్వాగతిస్తాం
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్తానంటే పూలమాలతో స్వాగతిస్తామని టీజేఏసీ పశ్చిమ జిల్లా కన్వీనర్ అశోక్‌కుమార్ అన్నారు. కాని తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడే సీమాంధ్ర ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదన్నారు. నరైన్ ట్రస్ట్ అధినేత చాంగండ్ల నరేంద్రనాధ్ దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్, దళిత సంఘాల నాయకులు సంజీవయ్య, విద్యార్థి సంఘం నాయకులు మాదాసు శ్రీనివాస్, సదాశివపేట పార్టీ అధ్యక్షులు బాల్‌రెడ్డి, ఎంపీజే జిల్లా కోకన్వీనర్ అన్వర్‌లతో పాటు టీజేఏసీ నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరుకే సీఎం..
అల్లాదుర్గం రూరల్: కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకే సీఎం అని, రాష్ట్రానికి కాదని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సొంత జిల్లాకు రూ. 6 వేల కోట్లు మంజూరు చేసుకుని అనుయాయులకు ఫలహారంగా పంచిపెడుతున్నారని అన్నారు. అల్లాదుర్గం మండలం వట్‌పల్లిలోని వెంకటఖాజా దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా నీది చిత్తూరు, నాది చిత్తూరు అంటూ చంద్రబాబు, సీఎం కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అవిశ్వాసం పెడితే కిరణ్ ప్రభుత్వనికి చంద్రబాబు అండగా ఉండి కాపాడారని ఆయన తెలిపారు. ఇది టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు కుతుబొద్దిన్, అంజిరెడ్డి, చంద్రశేఖర్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి ముమ్మాటికీ మనదే
Published Mon, Nov 25 2013 11:14 PM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
Advertisement
Advertisement