ఆంక్షలు లేని రాష్ట్రమే కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అమోఘమైనదని, తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులుగా మనం కీలక పాత్ర పొషించాలని టీజేఏసీ ైచైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు.సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం, రంగారెడ్డి జిల్లా శాఖ నిర్వహించిన ‘తెలంగాణ పునర్ నిర్మాణంలో ఉద్యోగుల పాత్రపై’ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. 60 ఏళ్లుగా తె లంగాణ ఉద్యమంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ఉద్యోగులేనని చెప్పారు. వలసవాదులు అన్నింటా తెలంగాణను ఆక్రమించి వనరులు దక్కకుండా చేశారని ఆరోపించారు.
భద్రాచలం, మునగాల తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, అందరం కలిసి మెరుగైన మానవీయ తెలంగాణను నిర్మించుకుందామన్నారు. పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత ఏం చేశారని భావితరాలు ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉండాలన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ రాకపోతే తమ తడాఖా చూపిస్తామన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.దేవీప్రసాదరావు మాట్లాడుతూ, కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ నిఘా అవసరమన్నారు. ఉద్యోగులకు పరిమితిలేని వైద్యం అందివ్వాలన్నారు. అందుకు హెల్త్‌కార్డుల జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె.రవీందర్ రెడ్డి ,తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి.విఠల్, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.జ్ఞానేశ్వర్, రంగారెడ్డి జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షకార్యదర్శులు కె.లక్ష్మణ్, ఎల్.రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.