మళ్లీ లొల్లి! | 'mallanna sagar' agitation | Sakshi
Sakshi News home page

మళ్లీ లొల్లి!

Published Wed, Aug 10 2016 9:39 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు - Sakshi

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు

  • రాజుకున్న ‘మల్లన్నసాగర్‌’ వ్యవహారం
  • ఒకపక్క ప్రతిపక్షాల దీక్షలు.. మరోపక్క భూ రిజిస్ట్రేషన్లు
  • వేములఘాట్‌ మినహా మిగతా గ్రామాలు భూ సేకరణకు సై
  • ‘2013’ చట్టం కోసం కాంగ్రెస్‌ పట్టు
  • సంగారెడ్డిలో జగ్గారెడ్డి దీక్ష భగ్నం
  • సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు మళ్లీ రాజుకుంది. భూ సేకరణ వద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు దీక్షలకు దిగుతుంటే.. మరోపక్క నిర్వాసితులు తమ భూములను సర్కారుకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

    బుధవారం ముంపు గ్రామాలైన ఎర్రవల్లిలో 8.5 ఎకరాలు, తొగుటలో 12 మంది రైతులు 21 ఎకరాలు,  ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నలుగురు రైతులు 8 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. కోర్టులు, చట్టాలు, జీవోల సంగతి ఎలా ఉన్నా.. ఊరును పోలిన ఊరును కట్టిస్తామని, ఊపాధి  చూపిస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పిన మాటలపై నమ్మకం ఉంచి భూసేకరణకు సిద్ధపడుతున్నామని ముంపు గ్రామాల ప్రజలు అంటున్నారు.

    కాగా, 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగ్గారెడ్డి బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో దీక్షకు దిగబోగా.. పోలీసులు భగ్నం చేశారు. అదే రోజు 123 జీవోకు అనుకూలంగా తీర్పు వెలువడింది. దీంతో అటు అనుకూల, ఇటు వ్యతిరేక పరిణామాలతో మల్లన్నసాగర్‌ మళ్లీ తెరపైకి వచ్చింది.

    ఆగుతూ.. సాగుతూ..
    గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మిస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్‌కు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇటీవల 123 జీఓ కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముంపు గ్రామాల్లో భూ సేకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా సింగిల్‌ జడ్జి తీర్పును ఏసీజే జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసారావులతో కూడిన ధర్మాసనం రద్దు చేయటంతో తాత్కాలికంగా ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్‌  మళ్లీ ఊపందుకుంది. తొగుట, కొండపాక మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, తొగుట గ్రామల్లో తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్వాసితులు అంగీకరించి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.  

    ఆ ఒక్క గ్రామమే మిగిలింది..
    సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా ఎత్తులు వేసింది. అయితే, తాజా పరిణామాలతో ఆ పార్టీ ప్రయత్నాలకు అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించటం లేదు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో ఒక్క వేములఘాట్‌ ప్రజలు మాత్రమే ప్రస్తుతం భూసేరణను వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన గ్రామాలు దాదాపు భూములు ఇవ్వటానికి ముందుకు వస్తున్నాయి.

    2013 భూ సేకరణ చట్టం ప్రకారమైతే.. భూములు కోల్పోయి మళ్లీ కోర్టుల చుట్టు తిరగాలని, అంత ఓపిక లేదని నిర్వాసితులు అంటున్నారు.   ప్రభుత్వం చూపుతున్న ప్రత్యామ్నాయాలు సైతం బాగున్నాయని, అందుకే 123 జీఓకు అంగీకరిస్తున్నామని వారు చెబుతున్నారు. 123 ఉత్తర్వుల ద్వారా నిర్ణయించిన ధర 15 నుంచి నెల రోజుల్లో చేతికి అందటం, ప్రాజెక్టు నిర్మాణంతో  పాటే ముంపు గ్రామాన్ని పోలిన కొత్త గ్రామాన్ని నిర్మించి ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీ నిర్వాసితులను ఆకర్షిస్తోంది.

    123 జీవో నచ్చింది  
    123 జీవో నచ్చింది కనుకనే భూముల రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఒప్పుకున్నాం. డబుల్‌ బెడ్‌ రూం పథకంలో  నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టమైన హామీనిచ్చారు. నేను 3.05 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ చేశాను. - మన్నెం రాంరెడ్డి, ఎర్రవల్లి, కొండపాక మండలం

    ఎవరి ఒత్తిడీ లేదు..
    భూముల రిజిస్ట్రేషన్‌లో మాపై ఎవరి ఒత్తిడీ లేదు. 123 జీవో ప్రకారం నిర్వాసితులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం మరిన్ని అంశాలు చేర్చిన విషయం తెలుసుకొని భూములను ఇచ్చేందుకు అంగీకరించాం. - మన్నెం కనకలక్ష్మి  ఎర్రవల్లి;  కొండపాక మండలం

    భూ రిజిస్ట్రేషన్‌ ఇలా..(భూమి ఎకరాల్లో)
    గ్రామం                           రైతులు            పట్టా            అసైన్డ్‌
    ఏటిగడ్డ కిష్టాపూర్‌              673         1214.39      254.23
    తొగుట                             492            954.25      490.26
    తుక్కాపూర్‌                     194            240.01      371.19
    ఎల్లారెడ్డిపేట                       32              65.00       31.32
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement