ఆర్టీఏలో ఆయనంటే హడల్
ప్రతి పనికీ ఒక రేటు.. చేయి తడపనిదే ఫైలు కదలదు
రవాణాశాఖలో ఆ కానిస్టేబుల్.. ఫెవిల్‌కాల్‌వీరుడు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో ఆయనో కానిస్టేబుల్. బదిలీకి అతీతుడిగా.. ఫెవికాల్ వీరునిగా స్థిరపడిన ఈయన కార్యాలయంలో ప్రతి పనికీ చేయి తడపనిదే ఫైలు ముందుకు కదలనీయకుండా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. వివరాల్లోకి వెలితే... ఆర్టీఏ కార్యాలయంలో కిందిస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లకు ప్రతి మూడునెలలకోసారి బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. దీని వలన అవినీతి అక్రమాలను తగ్గించవచ్చు అని భావించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిబంధన పకడ్బందీగా జరుగుతున్నా అనంతపురంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉందని సాకు చూపడంతో ఇతడిని బదిలీ నుంచి మినహాయించారు. దీంతో రెండేళ్లుగా ఇక్కడే పాతుకుపోయాడు. అక్రమ వసూళ్లకు అలవాటుపడటం వల్లే ఇక్కడి నుంచి కదలడం లేదని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం బదిలీలు జరిగినా అధికారులు ఆయనకు పూర్తిగా మినహాయించారు. జిల్లాలోని మిగతా ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేయడానికి తాము అనర్హులమా అంటూ నిట్టూరుస్తున్నారు.
కానిస్టేబుళ్ల కొరత ఉందనే
ఇటీవల జరిగిన బదిలీల్లో సదరు కానిస్టేబుల్‌ను ఇతర ప్రాంతాలకు కాకుండా జిల్లా కేంద్రంలోనే మరొక ఎంవీఐ వద్దకు బదిలీ చేశాం. జిల్లా కేంద్రంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు కానిస్టేబుళ్ల కొరత ఉంది. ఈ సమయంలో బదిలీ చేయడం వలన అధికారులకు ఇబ్బందులు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యోగుల బదిలీ చేశాం.
- శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం