వంటకు ‘పెద్ద’ కష్టం !
వంటకు ‘పెద్ద’ కష్టం !
Published Thu, Dec 15 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
- పెద్దనోట్ల రద్దుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కష్టాలు
- నగదు నిల్వలు ఉన్నా తీసుకోలేని పరిస్థితి
- సరుకుల కొనుగోలుకు అప్పులే దిక్కు
కర్నూలు సిటీ:
నగదు కష్టాలకు అందరూ అతీతులే అన్నట్లుగా మారింది. పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న ఏజెన్సీలకు కూడా తాకింది.
విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు ఇవ్వక పోవడంతో పాటు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ఖాతాల్లో నగదు ఉన్నా బ్యాంకుల్లో నగదు కొరతతో తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా చోట్ల ఏజెన్సీలు పెట్టిందే తినాలి అన్నట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 ఉన్నాయి.
నోట్ల రద్దుతో నిర్వాహకులకు కష్టాలు:
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం కింద 2847 వంట ఏజెన్సీలో ఉన్నాయి. నెల రోజులు దాటినా నోట్ల రద్దు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా చోట్ల కూరగాయాలు, నూనె, కోడి గుడ్లు తదితర వస్తువులను అధిక వడ్డీలకు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కొంత మంది నోట్ల రద్దును సాకు చూపి మెనూ కూడా పాటించడం లేదు. మరి కొన్న చోట్ల అసలు కోడి గుడ్లు అందించడం మానేశారు.
రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం: మంగమ్మ, కోసిగి జడ్పీ హైస్కూల్ ఏజేన్సీ నిర్వాహకురాలు .
మా స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు రోజుకు రూ. 1000కి పైగా ఖర్చు అవుతుంది. ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మా ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసేందుకు వెళ్తే పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. రోజు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. వంట చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు సమస్యను పరిష్కరించాలి.
అప్పులు చేయాల్సి వస్తుంది: భూలక్ష్మమ్మ, నగరపాలక సంస్థ హైస్కూల్, కర్నూలు
రోజుకు 900 మందికిపైగా విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నాం. సరుకులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. నోట్ల రద్దు వల్ల కూరగాయలు, కిరాణం దుకాణాల్లో ఇప్పటికే ఖాతా పెట్టాం. నెల రోజులు కావడంతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సరుకులు ఇస్తామంటున్నారు. కోడి గుడ్లు కొనుగోలు చేసేందుకు అధిక వడ్డికి అప్పులు తెచ్చాం.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా: కె. రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ
వంట ఏజెన్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పటికే ప్రాథమిక స్కూళ్లకు బిల్లులు విడుదల కావడంతో వారికి డబ్బులున్నా డ్రా చేసుకోలేక పోతున్నారు. వారానికి రూ. 24 మాత్రమే బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలు పడుతున్నారు. సమస్య త్వరగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తాం.
Advertisement