పేదలపై ‘గ్యాస్’ భారం
♦ మార్చి నాటికి సబ్సిడీ పూర్తిగా ఎత్తివేత
♦ బీపీఎల్ కుటుంబాల్లో ఆరిపోనున్న గ్యాస్ వెలుగులు
సాక్షి, హైదరాబాద్: పేదలకు వంట గ్యాస్ ఇక భారం కానుంది. గృహోపయోగ గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెలా రూ. 4 చొప్పున ధర పెంచి, వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదల ఇళ్లల్లో గ్యాస్ వెలుగు ఆరిపోయే పరిస్థితికి దారి తీయనుంది. సంపన్న వర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొనేందుకు ముందుకు రాకపోవడమే ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులకు దారితీసిందనే వాదనలు వినబడుతున్నాయి.
సంపన్న వర్గాలకు సబ్సిడీ..
గ్రేటర్ హైదరాబాద్‌లో సగానికి పైగా సంపన్న, అధిక ఆదాయ వర్గ కుటుంబాలు గృహోపయోగ వంట గ్యాస్‌పై సబ్సిడీ పొందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహానగరంలో సుమారు 25 లక్షల వరకు కుటుంబాలు ఉండగా, అందులో వంట గ్యాస్ కనెక్షన్లు వినియోగిస్తున్న కుటుంబాలు 22 లక్షల వరకు ఉన్నాయి. మరో 3 లక్షల కుటుంబాలు కిరోసిన్, వంట చెరుకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న బీపీఎల్ కుటుంబాలు తొమ్మిది లక్షలకు మంచి లేవని పౌరసరఫరాల శాఖ‡ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 13 లక్షల కుటుంబాలు ఆదాయ వర్గాలుగా స్పష్టమవుతోంది.
వదులుకుంది 90 వేల కుటుంబాలే...
వంట గ్యాస్‌పై సబ్సిడీ వదులు కున్న కుటుంబాల సంఖ్య వెళ్లపై లెక్కించవచ్చు. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా సంపన్న వర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని (గివ్ ఇట్ ఆప్) పిలుపు ఇచ్చారు. సెలబెట్రీలు రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేశారు. ప్రధాన ఆయిల్ కంపెనీలు మొబైల్ ద్వారా సంక్షిప్త సమాచారాలు పంపాయి. అయితే, వీటికి సంపన్న, అధిక ఆదాయ వర్గాల నుంచి వచ్చిన స్పందన మాత్రం అంతంతే. కేవలం 90 వేల కుటుంబాలు మాత్రమే సబ్సిడీని వదులుకున్నట్టు ఆయిల్ కంపెనీల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఏడాదికి సబ్సిడీ రూ.1056..
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్‌పై అందించే సబ్సిడీ సొమ్ము ఏడాదికి రూ. 1056 మాత్రమే. ఈ మొత్తాన్ని వదులుకునేందుకు సంపన్నులు ముందుకు రాకపోడం గమనార్హం.