♦ పది విద్యార్థులకు ఆఫర్ల పేరుతో ‘కార్పొరేట్’ ప్రలోభాలు
♦ పీఆర్‌ఓలను ఏర్పాటు చేసి మరీ అడ్మిషన్లు చేస్తున్న వైనం
♦ ఇప్పుడే రిజిష్టర్ చేసుకోవాలంటూ ఒత్తిడి
♦ ఇదేం గోల అని వాపోతున్న తల్లిదండ్రులు
వైవీయూ : పదో తరగతి పరీక్షలు పూర్తయి రెండు రోజులు కూడా గడవక ముందే విద్యార్థుల వద్దకు కార్పొరేట్ గద్దలు వాలిపోయాయి. పది పరీక్షా కేంద్రాల వద్దనే కరపత్రాలతో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కళాశాలల ప్రతినిధులు.. అనంతరం విద్యార్థుల ఇళ్ల చుట్టూ జోరీగల్లా తిరుగుతున్నారు. పది ఫలితాల్లో 10కి 10 జీపీఏ సాధిస్తే మా కళాశాలలో హాస్టల్ ఉచితమని ఓ కళాశాల.. స్వల్ప మొత్తంతో హాస్టల్ వసతి కూడా కల్పిస్తామంటూ మరో కళాశాల..
ఇలా ఆఫర్లతో మభ్యపెడుతున్నాయి. 9.0 పైన, అంతకంటే తక్కువ వచ్చిన వారికి కూడా కాస్తో కూస్తో తగ్గిస్తాం... అదీ ఇప్పుడు రిజిష్టర్ చేసుకుంటేనే అంటూ చెప్పిందే చెబుతూ పదే పదే ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పది పరీక్షలు రాసిన విద్యార్థుల చిరునామాలు, వారి తల్లిదండ్రుల సెల్ నెంబర్లు తెలుసుకుని మరీ విసిగిస్తుండటంతో తల్లిదండ్రులు ఇదేం గోలరా బాబూ అంటూ జుట్టు పీక్కుంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం రిజిష్టర్ చేయించుకుంటే ఫీజులో 10 శాతం రాయితీ కల్పిస్తామని తర్వాత అయితే ఏమీ చేయలేమంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో లేనిపోని ఆందోళన సృష్టిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు సైతం ఇక్కడ పీఆర్‌ఓలను ఏర్పాటు చేసుకుని అడ్మిషన్లు నిర్వహించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.
దీంతో పాటు ఓ కార్పొరేట్ కళాశాల తమ బ్రాంచ్‌లో పదోతరగతి విద్యార్థులకు పది రోజుల పాటు డిజిటల్ బోధన ఉచితంగా నిర్వహిస్తామని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రవేశాలు పొందవచ్చని పేర్కొనడం విశేషం. ‘విజయవాడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాల మహిళా బ్రాంచ్‌లో హాస్టల్‌లో సీటు రావడం మామూలు విషయం కాదు. ఈ వారంలో అడ్మిషన్ పొందితే అక్కడ హాస్టల్ సీటు గ్యారెంటీ’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. ఇంటెన్సివ్ బ్యాచ్, స్పెషల్ బ్యాచ్, ఐఐటీ బ్యాచ్, మెడికల్ అకాడ మి.. ఇలా వేర్వేరు పేర్లతో నిర్వహించే తరగతులకు లక్షలాది రూపాయల ఫీజు నిర్ధారించి.. ప్రవేశాలకు ఆఫర్‌లు చూపుతూ తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి తోడు స్థానిక కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం అడ్మిషన్లు చేయిస్తే వారికి ప్రోత్సాహకంగా కమీషన్ ముట్టచెబుతుండటం గమనార్హం. మీ పిల్లలు పరీక్షలు బాగా రాశారని తెలిసిందని.. ఎలాగూ మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి త్వరగా ప్రవేశాలు పొందాలని.. ఫలితాల కంటే ముందుగానే తరగతులు సైతం నిర్వహిస్తామని పేర్కొంటుండం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసేలా అడ్మిషన్లు నిర్వహించడం తగదు. ఇంటర్ మూల్యాంకనంలో ఉన్న మా దృష్టికి ఈ క్యాంపెయిన్ సమస్య రాలేదు. దీనిపై దృష్టి సారించి తగిన చర్యలు చేపడతాం. కళాశాలల్లో ప్రవేశాలు, తరగతులు ముందుగా చేపడితే చర్యలకు ఉపక్రమిస్తాం. - రవి, ఆర్‌ఐఓ, కడప