ఒంగోలు: పాఠశాల స్థాయిలో ఏ తరగతికి అడ్మిషన్ టెస్టులు నిర్వహించరాదనే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కార్పొరేట్ పాఠశాలలు వాటిని తుంగలో తొక్కుతున్నాయి. అనధికారికంగా అప్రైజల్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తూ సాధారణ పాఠశాలల ఉనికిని దెబ్బతీసేందుకు శ్రీకారం చుడుతున్నారంటూ ఈనెల 6వ తేదీ ప్రకాశం రికగ్నైజ్డ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ప్రస్మా) జిల్లా అధ్యక్షుడు బి.హనుమంతరావు, కార్యదర్శి వీఎన్‌జీ మాధవరావు తదితరులు గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌ను, జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి ఫిర్యాదు చేయడం తెలిసిందే.
కార్పొరేట్ ఎత్తుగడ ఇలా...
కార్పొరేట్ పాఠశాలలు తమ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థులకు ముందుగానే వారి స్థాయికి మించిన ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నారు. వారు విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన పాఠ్యాంశాల బోధనను అమలు చేయడంలేదు. కేవలం మొక్కుబడిగా ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షలను అక్రమ విధానంలో నిర్వహిస్తూ మార్కులను మాత్రం తమదైన శైలిలో వేస్తున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు నిర్ణయించుకున్న ప్రతినిధులు(ఏజెంట్లు) కొంతమంది రంగంలోకి దిగి గ్రామాల్లో పరీక్షల పేరుతో తల్లిదండ్రులను కలుస్తున్నారు. మీ విద్యార్థి సత్తా ఏమిటో పరీక్షలు రాసి మీరు అంచనాకు రావచ్చు అంటూ వివరిస్తున్నారు. తమకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదని చెబుతూ కేవలం విద్యార్థుల సామరŠాథ్యలను అంచనా వేసేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు చెప్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పరీక్షకు సంబంధిత కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా హాజరై తమకు ముందుగానే బోధించిన ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయడం పరిపాటిగా మారింది. అయితే ఇతర పాఠశాలల విద్యార్థులకు వారు నేర్చుకున్న ప్రభుత్వ విద్యలోని పాఠ్యాంశాలు ఉండవు. దీంతో బయటి విద్యార్థులకు మార్కులు తక్కువుగా రావడం సహజం. ఇక్కడే కార్పొరేట్ కుయుక్తులు పన్నుతోంది. మీ పిల్లలు తమ పాఠశాలలో చదవకపోవడం వల్లే తక్కువ మార్కులు వస్తున్నాయని, అదే తమ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వస్తున్న మార్కులను చూసుకోండంటూ వారిని ప్రలోభ పెట్టే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అయితే టాలెంట్ టెస్టులు, అడ్మిషన్ టెస్టులు నిర్వహించరాదనే ఉత్తర్వులు ఉండడంతో మారుపేర్లతో టెస్టులను నిర్వహిస్తుండడం గమనార్హం.
ప్రస్మా ఆరోపణలివి...
టాలెంట్ టెస్టుల నిర్వహణే సరికాదు.. అలాంటిది విద్యార్థి స్థాయికి మించి కావాలని ఇంటర్మీడియట్ ప్రశ్నలను ఇస్తూ తల్లిదండ్రులను తప్పదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయంటూ ప్రస్మా జిల్లా అధ్యక్షుడు బి.హనుమంతరావు ఆరోపించారు. కేవలం ప్రైవేటు పాఠశాలల్లోను, ప్రభుత్వ పాఠశాలల్లోను ఉన్న తెలివితేటలు గల విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్చుకోవడానికి పన్నుతున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. ముందుగానే తమ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రశ్నలను లీక్‌చేసి ఇతర పిల్లలతో పాటుగా పరీక్షలకు కూర్చోబెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. పిల్లల స్థాయికి మించి (అంటే వారికి సిలబస్‌లేని) అంశాలపై ప్రశ్నలు తయారుచేసి పరీక్షలను నిర్వహించడం ద్వారా విద్యార్థులపై తల్లిదండ్రుల్లో తీవ్ర అపనమ్మకం ఏర్పడడం, తద్వారా విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యే అంశాలు ఉన్నాయంటున్నారు. చిన్నపిల్లలుకు టాలెంట్ టెస్టులు నిర్వహించడం హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం అని, కమిషన్ ఏజెంట్లను నియమించి అడ్మిషన్ టెస్టులు జరుపుతున్నవారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా తమకు లభించిన ఓ కార్పొరేట్ స్కూల్ పేరుతో ఉన్న స్టూడెంట్ అప్రైజల్ టెస్టు ప్రశ్నావళిని కూడా అధికారులకు అందించామని ప్రస్మా ప్రతినిధులు తెలిపారు.
కార్పొరేట్ కుయుక్తులు
Published Mon, Feb 13 2017 2:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement
Advertisement