కార్పొరేషన్‌లో కాసుల వేట
విజయవాడ సెంట్రల్ :
నగరపాలక సంస్థలో కాసుల కటకట నెలకొంది. ఉద్యోగుల ఆగస్ట్ జీతాలకు వెతుకులాట సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రెవెన్యూ వసూళ్లు దెబ్బతిన్నాయి. టౌన్‌ప్లానింగ్ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వినాయకచవితి, బక్రీద్ పండుగల నేపథ్యంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్ బుధవారం తన చాంబర్‌లో రెవెన్యూ, అకౌంట్స్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. అకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదని, కాబట్టి ఈదఫా జీతాల చెల్లింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మేయర్ రెవెన్యూ కలెక్షన్స్‌ను వేగవంతం చేయడంతో పాటు టౌన్‌ప్లానింగ్ బకాయిలను వెంటనే రాబట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సాధ్యమైనంత వరకూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) ఏవీ రమణి, సిటీప్లానర్ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.