అవినీతికి కేరాఫ్ సీఆర్‌డీఏ
► అభివృద్ధి పేరుతో భూములు లాక్కునే యత్నం
► బ్యాంకర్ల సదస్సులో గళమెత్తిన రాజధాని రైతులు
వెంకటపాలెం(తుళ్లూరు రూరల్): ‘‘మా భూముల సమస్యలపై అధికారులను ప్రశ్నించడమే మేము చేస్తున్న తప్పులా ఉంది...మా సమస్యలు పరిష్కరించండి అన్నందుకు మాపై కేసులు బనాయించి స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేశారు.’’ అంటూ యర్రబాలెం, పెనుమాక గ్రామాల రైతులు సీఆర్‌డీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని సీఆర్‌డీఏ యూనిట్ కార్యాలయంలో బుధవారం ఉదయం సీఆర్‌డీఏ అధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజధాని రైతులతో సమావేశం నిర్వహించారు.
సీఆర్‌డీఏ భూవ్యవహారాల సంచాలకుడు బీఎల్ చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఆర్‌డీఏ స్ట్రాటజీ డైరెక్టర్ శాస్త్రి రైతులకు ప్రపంచబ్యాంకు ద్వారా రుణం తీసుకుని ఏ విధంగా అమరావతి ప్రాంతం అభివృద్ధి చేయనున్నారో వివరించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సీఆర్‌డీఏ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయని, రైతులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వెళ్తే లంచాలు డిమాండ్ చేస్తున్నారని అరోపించారు. యర్రబాలెంకు చెందిన వి.కె.రెడ్డి అనే రైతు గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయొజనం లేకపోయిందని అన్నారు.
వెలగపూడి, రాయపూడి రైతులు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్‌లో తమ భూములు ఇవ్వలేదని జరీబు భూములను దుక్కులుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారి వివరాలను తెలపాలని ఆరు నెలలుగా పెనుమాక సీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులను అడుగుతున్నా, ఇంకా సమాచారం రాలేదని చెబుతూ వచ్చారని, ఇప్పుడు ఇక్కడ వందల సంఖ్యలో ఇళ్లు పోతున్నాయని చెబుతున్నారని పెనుమాక గ్రామస్తులు ప్రశ్నించారు. సమస్యలను తమకు చెప్పవద్దని అధికారులు అనడంతో రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకు బృందంతోనే చెప్పుకున్నారు. రాజధానిలో రాబోయే ప్రతి సంస్థలో రైతుల పిల్లలకు మొదటి అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిదానికి తాము ప్రాధేయపడే పనిలేకుండా రైతులతో కమిటీలు నియమించాలని అధికారులకు సూచించారు.
సమస్యలు చెప్పవద్దు....సలహాలు, సూచనలు ఇవ్వండి
రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల సమస్యలను వినడానికి సీఆర్‌డీఏ అధికారులకు విసుగ్గా ఉందని భూములు ఇచ్చిన రైతులు అరోపిస్తున్నారు. సదస్సులు నిర్వహిస్తారు కాని తమ గోడు పట్టించుకోరంటున్న రైతుల అరోపణను బుధవారం సీఆర్డీఏ అదికారులు నిజం చేశారు. ప్రపంచ బ్యాంకు బృందంతో జరిగిన సమావేశంలో కొందరు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని అడగ్గానే అధికారులు మీ వ్యక్తిగత సమస్యలు ఇక్కడ ప్రస్తావించవద్దని, అభివృద్ధికి సహకరించి సలహాలు సూచనలు ఇవ్వాలని అనడంతో రైతులు కోపోద్రికులయ్యారు.