సంరక్షణ ముసుగులో భారీ భక్షణ
♦ పర్యావరణం పేరుతో ఏపీఎండీసీలో స్వాహా పర్వం
♦ రూ.అరకోటి వ్యయం ప్రశ్నార్థకం
♦ రికార్డుల్లో లక్షల్లో మొక్కల పెంపకం
♦ కనిపించని వనాలు
ఆ సంస్థ అవినీతి అధికారులకు అడ్డా. అడ్డదారుల్లో బొక్కేయాలంటే వారికివారే సాటి. కాలుష్యకోరల నుంచి ప్రజలను కాపాడాలని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు కొందరు అధికారులకు కల్పతరువులా మారాయి. ఇందుకు మంగంపేట బెరైటీస్ గనుల పరిసరాల్లో పర్యావరణం కోసం దశాబ్దకాలంగా ఖర్చుపెట్టిన నిధులే నిదర్శనం. పర్యావరణాన్ని పరిరక్షించడానికి లక్షలాది మొక్కలు నాటామని రూ.అరకోటిపైన ఖర్చులు చూపించారు. కానీ వాస్తవంగా అక్కడ 200 చెట్లు కూడా కనిపిస్తే ఒట్టు.!
మంగంపేట(ఓబులవారిపల్లె): అధికారులు నాటిన మొక్కలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి.. కానీ వాస్తవానికి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు. మంగంపేట బెరైటీస్ గనుల పరిసరాల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలని కాలుష్య నియంత్రణ మండలి వారు స్పష్టమైన ఆదేశాలు గతంలో ఇచ్చి ఉన్నారు. అందులోభాగంగా గనులలో జరిగే డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌లతో వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాల్సి ఉంది. వాహనాలు తిరిగే ప్రాంతాల్లో ధూళి వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పొడవాటి చెట్లతో కూడిన హరితవనాలు పెంచి కాలుష్యాన్ని అరికట్టాల్సి ఉంది. అయితే అవన్నీ మంగంపేట బెరైటీస్ గనుల ప్రాంతంలో నామమాత్రమే. అసలు ఏపీఎండీసీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. నిధులు మాత్రం ఖర్చయ్యాయి.
లెక్కల తీరు ఇలా..
ఏపీఎండీసీ కార్యాలయ ఆవరణలో మొక్కలు పెంచడానికి ఆ శాఖ లెక్కల ప్రకారం 2003-04 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు రూ.93,038లు ఖర్చు చూపించారు. 2004-05లో 4,248 మొక్కలు నాటి 625 కేజీల సూబాబుల్ విత్తనాలు మట్టిగుట్టలపై చల్లినందుకు రూ.1,23,187లు వ్యయం చేశారట. 2005-06లో 200 మొక్కలు నాటినందుకు రూ.1,62,511లు ఖర్చు, 2006-07లో 10 వేల మొక్కలు, 150 కేజీల సూబాబుల్ విత్తనాలకు రూ.1,80,594లు, 2007-08 లో 10వేల మొక్కలకుగాను రూ.1,45,481లు, 2008-09లో రూ.1,25,540లు, 2009-10లో రూ.18,623లు, 2010-11లో రూ.37,332లు, 2011-12లో రూ.1,600లు, 2012-13లో రూ.8,800లు, 2013-14లో పర్యావరణం కోసం రూ.3,72,329లు, 2014-15లో కాలుష్య నియంత్రణకు రూ.76,108లు వెరసి దశాబ్దకాలానికి పర్యావరణ పరిరక్షణ కోసం మంగంపేట నందు ఏపీఎండీసీ రూ.56,26403-36లను వ్యయం చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
లక్షలు పోయి.. వందలు మిగిలాయి
ఏపిఎండీసీ అధికారులు చూపెడుతున్నంత పచ్చదనం పెంపు కాగితాలకే పరిమితమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకోసం చూపిస్తున్న రికార్డుల ప్రకారం పచ్చదనాన్ని కాంట్రాక్టర్లు బొక్కేశారా.. లేక అధికారుల మాయాజాలమా అన్న అంశం ప్రశ్నార్థకం. వాస్తవానికి ఏపీఎండీసీ గనుల నుంచి వెలికితీసిన వృథా మట్టిలోకాని అధికారులు పేర్కొంటున్న ప్రాంతంలోకాని నాటిన లక్షలాది మొక్కలు ఏమయ్యాయో వారికే తెలియాలి. ఇప్పటికి మంగంపేట సమీప గ్రామాల్లోకి వెళ్లాలంటే కాలుష్యంతో ఊపిరి ఆడక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పిర్యాదుచేసినా పట్టించుకున్న పాపానపోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.