- కేంద్రం నిధులతో ‘బాబు’ ప్రచారం
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి
రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న అవినీతి
Published Thu, Aug 18 2016 11:46 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
బోట్‌క్లబ్ ( కాకినాడ) :
రాష్ట్రంలో రోజురోజుకీ అవినీతి పేరుకుపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య విమర్శించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా అనేక నిధులు మంజూరు చేస్తోందని, కేంద్ర నిధులు తెచ్చుకొని వాటికి చంద్రబాబు పేర్లు పెట్టుకోవడం దారుణమని అన్నారు. ఎక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వం పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పు పట్టారు. మిత్రపక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చే విధంగా ఒక పక్క చర్చలు జరుపుతూనే ఇలాంటి విమర్శలు తగవన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయని, ఇటువంటి తరుణంలో మిత్రపక్షమైన టీడీపీ నాయకులు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, సహకరించడం లేదని చెప్పడం బాధాకరమన్నారు. సమావేశంలో బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ పెద్దిరెడ్డి రవికిరణ్ , నగర కన్వీనర్ మచ్చా గంగాధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు తదతరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement