నీటి శాఖలో అవినీతిని అరికట్టండి
-
బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు) : జిల్లాలోని నీటిపారుదలశాఖలో అవినీతిని అరికట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. నెల్లూరులోని ఆపార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నీటిపారుదలశాఖలో రూ.350 కోట్లు అవినీతి జరిగిందన్నారు. కంటి తుడుపు చర్యగా కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారని, అసలు నిందితులను గుర్తించాలన్నారు. అవినీతిపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. టెండర్లు లేకుండా నామినేషన్ ద్వారా పనులు చేజిక్కించుకున్న కొందరు తమకు అడ్డం లేదని ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులను దిగమింగేస్తున్నారని ఆరోపించారు. అలాగే సీఎంఆర్ బియ్యం, రెవెన్యూశాఖలో సర్టిఫికెట్లు జారీ చేయడంలో కూడా అవినీతి జరుగుతోందన్నారు. ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్, మొద్దు శ్రీను, మారుతికుమార్, బండారు సురేష్, రాధాకృష్ణ, అన్నం శ్రీనివాసులు పాల్గొన్నారు.