కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహం! | corruptions in sriramireddy drinking water project | Sakshi
Sakshi News home page

కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహం!

Published Tue, Nov 1 2016 10:40 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

శ్రీరామరెడ్డి పథకం ద్వారా ఆరేళ్లుగా తాగునీరు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టరు కోట్లు సంపాదిస్తున్నాడన్న భావనతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు దురాశకు పోతున్నారు.

–‘శ్రీరామరెడ్డి’ పథకం కాంట్రాక్టరును తొలగించి ఉద్యోగాల పేరుతో దోపిడీకి కుట్ర
– 700 మంది పొట్ట కొట్టే యోచనలో ఓ నేత కుమారుడు
– రూ.8 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే తప్పుకుంటానన్న కాంట్రాక్టర్‌


అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి పథకం ద్వారా ఆరేళ్లుగా తాగునీరు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టరు కోట్లు సంపాదిస్తున్నాడన్న భావనతో  అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు దురాశకు పోతున్నారు. తనకు ఎలాగైనా ఆ కాంట్రాక్టు కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి సహకారంతో మరో నలుగురు ఎమ్మెల్యేలను చేరదీసుకుని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టరు తప్పుకుంటే  సిబ్బందిని విధుల్లోంచి తొలగించి ఆ పోస్టులను అమ్ముకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమలో సుమారు 700 మందిని  తొలగించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేల దాకా వసూలు చేయాలని  ఇప్పటికే వ్యూహం పన్నినట్లు తెలిసింది. ఈ వ్యవహారంతో విసుగు చెందిన  కాంట్రాక్టరు మాత్రం జిల్లా పరిషత్‌ సీఈఓ రామచంద్రను కలసి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, తర్వాత తనకు ఈ కాంట్రాక్టు  అవసరమే లేదని రాత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం.

సరఫరా ఇలా..
శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 170 కిలోమీటర్ల పైపులైన్‌ ఉంది. దానికి అనుబంధంగా 1,800 కిలోమీటర్ల సబ్‌లైన్‌ వెళుతుంది.  ఈ పథకం ద్వారా హిందూపురం, రాయదుర్గం, మడకశిర, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలతో పాటు పలు గ్రామాలకు  నీరు సరఫరా అవుతోంది.  ఈ పథకం నిర్వహణ కోసం కాంట్రాక్టరుకు నెలకు  రూ.90 లక్షల ఖర్చు అవుతోంది. ఇదులో రూ.60 లక్షలు వేతనాలకు, రూ.30 లక్షలు నిర్వహణకు వెచ్చించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా నిర్వహణ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని,  ప్రతినెలా రూ.90 లక్షలు  సమకూర్చుకోవడానికి అవస్థ పడుతున్నానని కాంట్రాక్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఏడు నెలలకోసారి బిల్లులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, కాంట్రాక్టర్‌ను తొలగించి తాము ఆ వర్కును చేజిక్కించుకోవాలని చూస్తున్న నాయకుడు సోమవారం జెడ్పీలో పంచాయితీ కూడా పెట్టించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన కాంట్రాక్టర్‌ తన సంపాదన దేవుడెరుగు...పెట్టుబడి గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాంట్రాక్టును రద్దు చేసి ఈ ఏడాది మార్చి నుంచి తనకు రావాల్సిన బకాయిలు రూ.8 కోట్లు ఇప్పించాలని 45 రోజుల క్రితమే సీఈఓను కోరినట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. జెడ్పీ సీఈఓ రామచంద్ర ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement