చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో దంపతులను హతమార్చి, దహనం చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం: చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో దంపతులను హతమార్చి, దహనం చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. మక్కువ మండలం ఎస్.పెద్దవలస పంచాయతీ కొత్తకాముడవలస గ్రామానికి చెందిన గిరిజన దంపతులు గొల్లూరి పండు, సీతమ్మ దంపతులు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులకు అనుమానం ఉండేది.
ఈ నెల 8వ తేదీన అదే గ్రామానికి చెందిన జన్నిశ్రీను అనే వ్యక్తి కాలికి గాయం కావడంతో మరణించాడు. అయితే శ్రీను మరణానికి కారణం పండు, సీతమ్మలేనని శ్రీను కుటుంబ సభ్యులు అనుమానంతో ఈ నెల 9, 12 వ తేదీలలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ శ్రీను బంధువులు పెట్టారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోమారు పంచాయితీ పెడదామని పెద్దలు అక్కడినుంచి వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చెందిన పాలిక వెంకటి, పాలిక చంద్రరావు, జన్నిధర్మ, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాసిరావు, ఒడిశాకు చెందిన జన్ని గంగరాజు, జన్నిగోవిందలు బలవంతంగా పండు, సీతమ్మలను గ్రామం సమీపంలో ఉన్న పంటపొలంలోకి తీసుకెళ్లి కర్రలతో ఇష్టానురాజ్యంగా కొట్టడంతో వారిద్దరూ మృతి చెందారని కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అనంతరం మృతదేహాలను చిట్టిగెడ్డపక్కన మంగళవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో దహనంచేసి చితిబుగ్గిని నదిలో కలిపేశారు. ఆ సమయంలో పండు కుటంబసభ్యులు ఉన్నప్పటికీ అడ్డుకోలేకపోయారు. జరిగిన విషయాన్ని బయటకు చెప్పితే కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తదితరులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని హత్య, దహనపర్చిన స్థలాల్ని పరిశీలించి స్థానికులనుంచి సమాచారం తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.