రూ.2 వేలు వద్దు...చిన్ననోట్లు ముద్దు
– ఎస్‌బీఐ ముందు సీపీఐ, మహిళా సమాఖ్య ధర్నా
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన చిన్న నోట్లు అందుబాటులో పెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.పద్మావతి విమర్శించారు. రూ.2 వేలఽ నోట్లు తక్షణం రద్దు చేసి.. రూ.50, రూ.100 నోట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలనే డిమాండ్‌తో శనివారం స్థానిక సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధాన శాఖ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు కుమ్మక్కై ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అల్లీపీరా, పీఎల్ నరసింహులు, గోల్డ్‌బాషా, చాంద్‌బాషా, జమీర్, పవిత్ర, అరుణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.