బ్యాంకుల్లో నగదు నిల్!
* ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
* పనిచేయని ఏటీఏంలు
* బ్యాంకుల్లో నిలిచిన లావాదేవీలు
* సోమవారం వరకు డబ్బులు వచ్చే అవకాశం లేదంటున్న బ్యాంకర్లు
సాక్షి, అమరావతి బ్యూరో : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులను డబ్బు కొరత పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ శాతం ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకులకు వెళ్ళిన ఖాతాదారులకు చుక్కెదురవుతోంది. డబ్బు లేదని విత్‌డ్రాలకు చాలా బ్యాంకులు అనుమతించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారానికి విత్‌డ్రాల పరిమితి తగ్గించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యవసర పనులకు డబ్బులు అవసరమైతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన ప్రజలకు ‘డబ్బులు వస్తే ఇస్తాం.. లేకపోతే మేమేం చేస్తాం’ అని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ప్రజలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిరీక్షించి బాధతో వెళ్ళిపోతున్నారు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు వంటి ప్రధాన బ్యాంకులు విత్‌డ్రాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందంటే , డబ్బు కొరత జిల్లాలో ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ప్రైవేటు చిన్న బ్యాంకులకు కనీసం రూ.3 లక్షలైనా ఇచ్చేవారు. ఈరోజు లీడ్ బ్యాంకు వద్ద డబ్బు నిల్వలు లేకపోవడంతో ప్రైవేటు బ్యాంకులకు డబ్బు సరఫరా జరగలేదు. ఈ నేపథ్యంలో పలుచోట్ల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. పనిచేసిన అరకొర ఏటీఎంల నుంచి సైతం రూ.2000 నోట్లు రావడంతో చిల్లర దొరకక, ఈ నోటు ఏం చేసుకోవాలంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరింత పెరగనున్న కష్టాలు...
ఆర్‌బీఐ నుంచి జిల్లాకు సోమవారం వరకు డబ్బులు వచ్చే అవకాశం లేదని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ వచ్చినా అవి బ్యాంకులకు సరఫరా అయి, ప్రజలకు పంపిణీ అయ్యేసరికి మంగళవారం వరకు పడుతుందని తెలుస్తోంది. దీంతో ప్రజల డబ్బు కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే కోట్ల రూపాయలు అవసరం. అరకొరగా వచ్చే డబ్బు ఒకట్రెండు రోజుల్లోనే అయిపోతోంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం రకరకాల నిబంధనలను ప్రకటిస్తోంది. దీంతో ఏ రోజు ఎలాంటి కొత్త నిబంధనలు అమలుల్లోకి వస్తాయోనని జనం హడలిపోతున్నారు.