సాక్షి, హైదరాబాద్: దుబాయ్, మస్కట్ సహా అనేక దేశాల నుంచి గత ఏడాది దేశంలోకి అక్రమ బంగారం భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కస్టమ్స్ విభాగం అత్యంత అప్రమత్తత ప్రకటించింది. వరుస తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై విమానాశ్రయ కస్టమ్స్ విభాగం రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధికంగా 1010 కేజీల బంగారం రికవరీ చేసింది. ఈ టీమ్‌ను లీడ్ చేసింది తెలుగు తేజం... డాక్టర్ కర్లపు కిరణ్‌కుమార్. 2010 బ్యాచ్ ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి అయిన కిరణ్‌కుమార్ స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయన ఫోన్ ద్వారా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు...
ఏపీలోని వైజాగ్‌కు చెందిన కిరణ్‌కుమార్ తండ్రి కేడీఆర్ ఆచార్య రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి సునిత ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్నారు. విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లోనే చేసిన కిరణ్ ఆంధ్రా మెడికల్ కాలే జీ నుంచి ఎంబీ బీఎస్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఆర్‌ఎస్‌కు ఎంపికై కస్టమ్స్ విభాగంలో ఉన్నారు. 2012 నుంచి ముంబైలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన రెండేళ్ళుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.
ఆల్‌టైమ్ రికార్డు...
భారత్‌లో బంగారం అక్రమ రవాణా 1970ల్లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విమానాశ్రయం అధికారులూ పట్టుకోని విధంగా గతేడాది ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా 1010 కేజీల అక్రమ బంగారం చిక్కింది. ఢిల్లీ విమానాశ్రయంలో 600 కేజీలు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 150 కేజీలు స్వాధీనమైంది. ముంబైలో చిక్కిన టన్నుకు పైగా బంగారాన్ని కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందమే పట్టుకోవడం విశేషం. ఈ టీమ్ ఈ ఏడాది ఇప్పటి వరకు 350 కేజీలు స్వాధీనం చేసుకుంది. ఇది కూడా మిగతా ఎయిర్‌పోర్టుల్లో చిక్కిన దాని కంటే ఎక్కువే. ఒకే దఫా రెండు ఫై్లట్లలో మస్కట్ నుంచి వచ్చిన 25 కేజీల బంగారం స్వాధీనం ఈ టీమ్ పట్టుకున్న వాటిలో పెద్దమొత్తం.
ముంబై ద్వారా అక్రమ రవాణా చేసే ముఠాలకు విమానం క్రూతో పాటు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నారు. స్మగ్లర్ తమ వెంట తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలో క్రూకో, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికో అప్పగించి బయటకు వచ్చేస్తారు. వీరికి చెకింగ్ ఉండకపోవడంతో పాటు ఏ మార్గంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై కన్నేసిన కిరణ్ టీమ్ గతేడాది ఎయిర్‌పోర్ట్ మేనేజర్ జగదీష్‌బాబుతో పాటు ఇద్దరు క్రూ సిబ్బందిని అరెస్టు చేశారు.
స్మగ్లర్లతో పాటు వారి వెనుక వ్యవస్థీకృతంగా కథ నడిపే ఆర్గనైజర్లు, రిసీవర్లను పట్టుకున్నారు. ‘మేము తీసుకున్న చర్యలతో పాటు గతేడాది నవంబర్‌లో మారిన ఇంపోర్ట్ రెగ్యులేషన్స్‌తో ముంబై కేంద్రంగా జరిగే బంగారం అక్రమ రవాణా గణనీయంగా తగ్గింది’ అని కిరణ్‌కుమార్ అన్నారు.
‘గోల్డ్’ మ్యాన్
Published Sun, Oct 18 2015 11:32 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement