‘జంక్’తో జాగ్రత్త!
-
పిజ్జాలు, బర్గర్‌లతో అధిక కొవ్వు
-
తగ్గించకుంటే ఆరోగ్యసమస్యలు తప్పవు
-
నేడు ప్రపంచ జంక్‌ఫుడ్ డే
మహబూబ్‌నగర్ క్రైం: ఆహార పదార్థాలను తినేముందు వాటి రుచి, ధరలు ఎంత అని మాత్రమే చూస్తాం. ధరకే పరిమితం కాకుండా అందులో కేలరీలను చూడమంటున్నారు వైద్యులు. విదేశాల్లో హోటళ్లలో వంటకంతో పాటు ఎన్ని కేలరీలు అనే విషయం కూడా మెనూలో ఉంటుంది. మన పట్టణాల్లోనూ హోటళ్లలో వీటిని పొందపరిస్తే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. రోజువారీ తీసుకునే ఆహారంలో మనకు కావాల్సిన కేలరీల కంటే పట్టణవాసుల్లో చాలామంది అదనంగానే తీసుకుంటున్నారు. వీటిని ఏ రోజుకారోజు కరిగించాల్సిందే. కానీ ఆ పని చేయకుండా మరిన్ని అదనపు కేటరీలను ఒంట్లోకి చేర్చుకుంటున్నారు. జంక్ అంటే చెత్త. జంక్ ఫుడ్ అంటే చెత్తతిండి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్, తదితర వాటిని జంక్‌ఫుడ్ అంటారు. ఇష్టం వచ్చినట్లు చెత్తతిండి తిని, దానికి తగ్గ వ్యాయామం చేస్తున్నామా అంటే చాలా మంది వద్ద సమాధానం ఉండదు. కేలరీల రూపంలో ఒంట్లో కొవ్వు పెరిగిన తర్వాత చింతించే బదులుగా మూడు పదుల వయస్సు నుంచే ఎదురుదాడి చేస్తే మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను నిత్యం వ్యాయామం చేయడంతో తరిమికొట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
-
జిల్లాలో ప్రధాన పట్టణాల్లో అధిక సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. క్షణాల్లో తయారయ్యే వంటకంతో వచ్చే రుచికి అలవాటు పడి ఆరోగ్యం క్షీణించే విధంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా 13నుంచి 40ఏళ్ల వయస్సువారు ఇలాంటి ఫుడ్‌కు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఫాస్ట్‌పుడ్ సెంటర్స్‌తో పాటు బేకరీలలో పిజ్జా, బర్గర్లలో అధిక రసాయనాలు కలపడం వల్ల తక్కువ కాలంలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
జీర్ణం కాదు..
జంక్‌ఫుడ్‌లో ఎక్కువ కేటరీలు ఉండటం వల్ల త్వరగా జీర్ణం కాదు. దానికి తోడు ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఎవరూ కూడా కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం లేదు. దీనివల్ల పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు చేరుతుంది. ఆ తర్వాత రక్తపోటు, మధుమేహం, షుగర్, ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వారంలో రెండుమూడుసార్లు జంక్‌ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు తయారవుతుంది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లో అయిల్ ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. దానివల్ల కొత్త రోగాలు వస్తాయి. నెల రోజులు క్రమం తప్పకుండా బేకరి, ఫాస్ట్‌ఫుడ్ తింటే మనిషి శరీరంలో చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పెరిగి దానివల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌లో ఉప్పు, కారంతో పాటు రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తుంది.
– డాక్టర్ వనం శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్, జిల్లాసుపత్రి