- ఇక జిల్లా నిప్పుల వర్షం
- వారం రోజులు అత్యంత ప్రమాదకరం
- హైరిస్క్ జోన్‌గా 28 మండలాలు
- 52 డిగ్రీలు దాటే ప్రమాదం
- టాప్–10లో తొండంగి మండలం
- డేంజర్ జోన్‌లో జిల్లా
- ఇస్రో హెచ్చరికలతో అప్రమత్తం
- జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ
- ప్రతి అరగంటకోసారి పరిణామాలపై ఆరా
డేంజర్ జోన్‌లో జిల్లా
Published Sun, May 21 2017 12:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లా అగ్నిగుండంగా మారనుంది. రానున్న వారం రోజులు జిల్లా వాసులకు గడ్డుకాలమే. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వీస్తున్న వేడి గాలులకే కకావికలమైపోతున్న జిల్లా నిప్పుల కుంపటిగా మారనుందనే సమాచారంతో హడలిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాల్లో శ్రీకాకుళంతోపాటు ఉభయ గోదావరి జిల్లాలున్నాయి. జిల్లాలో ప్రస్తుతం నమోదవుతున్న 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలనే తట్టుకోలేకపోతున్న జిల్లా ప్రజలు మరో పది డిగ్రీలు అదనంగా అంటే 52 డిగ్రీలు ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే వారం రోజులు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదుకానున్నాయి. స్వయంగా ఇస్రో, విపత్తుల నివారణ సంస్థలే ఈ విషయాన్ని తెలియజేసినట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. కచ్చితంగా జిల్లావాసులకు ఇది పిడుగులాంటి వార్తే. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోను ఉష్ణోగ్రతలు ప్రమాదకర జోన్‌లో ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణశాఖ ఆదేశాలతో విపత్తుల నివారణ కమిషనరేట్ ప్రతి అరగంటకు వాతావరణంపై జిల్లాకు హెచ్చరికలు జారీచేస్తోంది. జిల్లాలో 64 మండలాలుండగా వాటిలో 28 మండలాలు అత్యంత ప్రమాదకర ఉష్ణోగ్రతలు నమోదయ్యేæ జోన్‌లో ఉన్నాయని గుర్తించారు. ప్రధానంగా తూర్పుతీరం పరిధిలోకి వచ్చే జిల్లాలోని సముద్ర తీర మండలాలు హైరిస్క్ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన 36 మండలాలకు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ కావడంతో జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది.
.
అరగంటకోసారి ప్రమాద హెచ్చరికలు...
ఈ కారణంగానే విపత్తుల నివారణ కమిషనరేట్ ప్రతి అరగంటకు ఒకసారి జిల్లాకు వాతావరణ హెచ్చరికలు జారీచేస్తోంది. ప్రధానంగా జిల్లాకు దక్షిణాన ఉన్న తీరప్రాంత మండలాల్లో ఉష్ణోగ్రతలు ఆందోళనకరంగా ఉండనున్నాయి. వచ్చే మూడు రోజులు తీరప్రాంత మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 45 నుంచి 52 డిగ్రీల ఉష్ణోగ్రతలు తీరప్రాంత మండలాల్లో నమోదయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదైనప్పటికీ జిల్లా సముద్ర తీరంలో ఉండటంతో దాని ప్రభావం అంతకు మించే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గాలిలో అధిక తేమ కారణంగా 52 డిగ్రీల స్థాయిలో వేసవి తీవ్రత ఉంటుంది. తీవ్ర ఉక్కపోత, అసౌకర్యాలు కలిగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నాయని హెచ్చరించిన టాప్10 మండలాల్లో జిల్లాలో తొండంగి మండలం ఉంది. సముద్ర తీరం జిల్లాలో తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ప్రారంభంకానుండటంతో అక్కడే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.
.
28 మండలాల్లో 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలుపైనే...
50 డిగ్రీల కంటే అత్య«ధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలాలు 28 వరకు ఉన్నాయి. వాటిలో తొండంగి, ఉప్పాడకొత్తపల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అమలాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రామచంద్రపురం, కాజులూరు, శంఖవరం, ప్రత్తిపాడు, గొల్లప్రోలు, కిర్లంపూడి, పిఠాపురం, రంగంపేట, బిక్కవోలు, పెదపూడి, సామర్లకోట, పెద్దాపురం, కరప, ఆత్రేయపురం, కడియం, ఆలమూరు, రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం. ఈ మండలాలు హైరిస్క్ జోన్‌లో ఉన్నాయి. మిగిలిన 36 మండలాలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు లోపు ఉండనున్నాయి.
.
‘నిరంతరాయంగా రక్షణ చర్యలు’
వాతావరణశాఖ హెచ్చరికల మేరకు రక్షణ చర్యలును జిల్లా యంత్రాంగం నిరంతరాయంగా చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు అదనంగా మరో పది వేల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చలివేంద్రాల ఏర్పాటు, ఇతర సహాయక చర్యలకు ప్రతి మండలానికి రూ.2 లక్షలు అత్యవసర నిధి విడుదల చేశాం. ఉపాధి హామీ పనులు వేకువ జామున ప్రారంభించి 11 గంటలలోపు ముగించాలి. దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు మూసివేయాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎండల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దు. నీడపట్టునే ఉండాలి.
.
‘ప్రజావాణి రద్దు’
తీవ్ర ఉష్ణోగ్రతలు, విపరీత వాతావరణం దృష్ట్యా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశాం. అర్జీదారులు ఈ అంశాన్ని గమనించి సహకరించాలి. వాతావరణ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
కార్తికేయ మిశ్రా, జిల్లా కలెక్టర్.కాకినాడ.
Advertisement