రైల్వే స్టేషన్‌లో దసరా సందడి
విజయవాడ (రైల్వేస్టేషన్) :
దసరా శరన్నవరాత్రులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల తాకిడితో రైల్వేస్టేషన్‌లో శనివారం సందడి ఏర్పడింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు సాధారణ వెయిటింగ్ హాళ్లతో పాటు 1, 10 ప్లాట్‌ఫాంలలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ వెయిటింగ్ హాళ్లు అందుబాటులో ఉంచారు. 1, 6 ప్లాట్‌ఫాంలపై అతి తక్కువ రుసుంతో చక్కటి ఏసీ, నాన్ ఏసీతో కూడిన విశ్రాంతి గదులు, డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి.
అదనపు బుకింగ్ కౌంటర్లు, ఏటీవీఎంలు
భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటుచేశారు. తూర్పు ముఖద్వారం 1, 2 ప్లాట్‌ఫాంలతో పాటు పార్శిల్ కార్యాలయం, తారాపేట టెర్మినల్‌లో ఈ అదనపు బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి.
సాధారణ టికెట్ల జారీకి ఏటీవీఎంలు, హ్యాండ్ వెండింగ్ మెషీన్లు
సాధారణ టికెట్ల కోసం గంటలకొద్దీ బుకింగ్ కౌంటర్ల ముందు వేచి ఉండకుండా క్షణాల్లో టికెట్ల జారీకి ఇప్పటికే ఏటీవీఎంలు 16, హ్యాండ్ వెండింగ్ మెషీన్లు 3 అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్లన్నీ ఫుల్
దసరా రైళ్లన్నీ రద్దీగా నడిచాయి. ఇప్పటికే పలు సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. చెన్నై–హౌరా, హౌరా–సికింద్రాబాద్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక రైళ్లలో సైతం వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది.
ప్రథమ చికిత్స కేంద్రం
ప్రయాణికులకు అస్వస్థత కలిగితే ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి వెళ్లవచ్చు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రైల్వే ఆస్పత్రికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏవైనా వస్తువులు పోయినా, చోరీకి గురైనా ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రైల్వేస్టేషన్‌లోనూ దుర్గమ్మ ప్రసాదం
ఇంద్రకీలాద్రి వరకూ వెళ్లలేని భక్తులు రైల్వేస్టేషన్‌లోనే దుర్గమ్మ ప్రసాదం పొందవచ్చు. తూర్పు ముఖద్వారం–1 (ఒకటో నంబరు ప్లాట్‌ఫాం) వద్ద కూడా దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు.