దత్తాత్రేయ ఇల్లు ముట్టడి
‘తెలంగాణ జాగృతి’ విద్యార్థులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తల అరెస్టు
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు బండారు దత్తాత్రేయ కారణమయ్యారని, ఆయన తక్షణం మంత్రిపదవికి రాజీనామా చేయాలని, దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసాన్ని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్, గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ యాదవ్‌ల ఆధ్వర్యంలో 100 మందికిపైగా విద్యార్థులు ముట్టడించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తోసుకుని గేటు లోపలికి చొరబడి బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో మంత్రి తన నివాసంలో లేకపోవడంతో ఆయన వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలబోమన్నారు. ముషీరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించారు.
ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆందోళన: కేంద్రమంత్రి దత్తాత్రేయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ కార్యకర్తలు మంగళవారం దత్తాత్రేయ నివాసం ముట్టడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన నవీన్‌రాజు మాదిగ, ఈశ్వర్, వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.