టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద మృతి
టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూనగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మనోహరయ్య(52) టీటీడీ పరిధిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలోని ఉమా వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న మనోహరయ్య కొన్ని రోజుల క్రితం ఆయలంలో అశ్లీల కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డాడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అతను మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక.. అతను చనిపోయిన విషయం ఎవరికి తెలయకుండా ఉంచేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది.
వివరాలు.. విశాఖ నుంచి ఈ నెల నాలుగో తేదిన ఇంటికి వచ్చిన మనోహరయ్యను అదే రోజు కుటుంబ సభ్యులు హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా.. నిన్న రాత్రి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. ఏమి లేదని బుకాయించి.. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్ తెప్పించారు. దీంతో ఇరుగుపొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని మనోహరయ్య తలపై ఉన్న గాయాలను గుర్తించి భార్య శారదే ఆయన్ని హతమార్చి ఉంటుందని ఆరోపిస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. పెద్ద కూతురు వివాహం అయింది. చిన్న కూతరు శిరీష బీటెక్ చదువుతోంది. భర్త మృతిచెందితే కారుణ్య మరణం క్రింద కూతురుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇద్దరు కలిసి తలపై కొట్టి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. భర్త మృతిచెందినా కనీసం బంధువులకు కూడా సమాచారం అందించకపోవడంతో భార్య తీరుపై పలువురు అనుమానాలు లెవనెత్తుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.