త్వరలో డయాలసిస్ యూనిట్
త్వరలో డయాలసిస్ యూనిట్
Published Wed, Jul 27 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వైద్యశాలలో ఉన్న ఫిమేల్ మెడికల్ వార్డును ఖాళీ చేయించి రోగులను బుధవారం వివిధ వార్డుల్లోకి తరలించారు. ఆ వార్డును గురువారం డయాలసిస్ విభాగానికి అప్పగించనున్నారు. ఈ విభాగంతో తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాల పరిధిలోని అనేక వేల మంది పేద రోగులకు ఉపయోగకరంగా మారనుంది. జిల్లా వైద్యశాలలో డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ భావించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని తెనాలి, గూడూరు, మచిలీపట్నం వైద్యశాలల్లో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన పరికరాలను కూడా పంపారు.
గురువారం హైదరాబాద్ నుంచి వచ్చే డయాలసిస్ నిపుణులు వార్డును పరిశీలించి దానిలో పరికరాల ఏర్పాటు చేయనున్నారు. కొద్ది రోజుల్లో డయాలసిస్ విభాగం పేద ప్రజలను అందుబాటులోకి రానుంది. తెనాలి ఏరియా వైద్యశాలను 2000 సంవత్సరంలో జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్ చేశారు. 200 పడకల వైద్యశాలగా తీర్చిదిద్ది అధునాతన పరికరాలు, వసతులను ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, బ్లడ్ బ్యాంక్, నవజాత శిశుకేంద్రం, అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలను అందుబాటులోకి తెచ్చారు. అధునాతన ఆపరేషన్ థియేటర్‌లను కూడా ఏర్పాటు చేసి పరికరాలను కూడా సమకూర్చారు. ఇటీవల వైద్యుల కొరత ఎక్కువగా ఉండడంతో పాలకులు, అధికారులు స్పందించి అన్ని రకాల వైద్య నిపుణులను బదిలీపై తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం జిల్లా వైద్యశాలలో ప్రతి రోజూ 1000 మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. ఇటీవల తక్కువ నెలలతో, తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు అందించే ఆక్సిజన్ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
Advertisement
Advertisement