* నిధులు ఫుల్.. పరికరాలు నిల్
* శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపని వైద్యులు
* అవస్థలు పడుతున్న పేదలు
తెనాలి జిల్లా వైద్యశాలను నిర్లక్ష్యపు జబ్బు పట్టిపీడిస్తోంది. సమృద్ధిగా నిధులున్నా.. వాటిని ఉపయోగించే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వైద్యులు, సిబ్బంది, రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాల 200 పడకల వైద్యశాలగా 2001లో అప్‌గ్రేడ్ అయ్యింది. అనంతరం దానిలో ఎన్‌టీఆర్ వైద్య సేవ, ఎస్‌ఎన్‌సీయూ, డయాలసీస్ వార్డులను ఏర్పాటు చేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని తెనాలి పట్టణం, తెనాలి, కొల్లిపర మండలాలు, వేమూరు నియోజక వర్గ పరిధిలోని వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలో రేపల్లె, నిజాంపట్నం, నగరం, మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల, కృష్ణాజిల్లా పరిధిలోని అవనిగడ్డ, అడవులదీవీ తదితర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స నిమిత్తం జిల్లా వైద్యశాలకు వస్తుంటా రు. రోజుకు ఓపీ కింద 1000 నుంచి 1200 మంది చికిత్స పొందుతున్నారు. వీరు కాకుం డా 200 మంది సాధారణ రోగులు, ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఎస్‌ఎన్‌సీయూ తదితర వార్డులలో మరో 50 మంది వరకు వైద్య సేవలు పొందుతూ ఉంటారు. జిల్లాలో గుంటూరు తర్వాత అతి పెద్ద వైద్యశాలగా పేరుంది.
ఎస్‌ఎన్‌సీయూలో నిలిచిన రక్త పరీక్షలు
ఎస్‌ఎన్‌సీయూ వార్డులో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. అప్పుడే పుట్టిన చిన్నారులను ఇక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. వారికి రక్తపరీక్షలు చేసేందుకు ప్రత్యేక పరికరం అవసరం. వాటిని అధికారులు అందుబాటులో ఉంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది, ఎస్‌ఎన్‌సీయూకు ప్రత్యేక నిధులున్నా వాటిని వినియోగించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. సాధారణంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఆస్పత్రి స్థాయిని బట్టి కొంత నిధులను ప్రభుత్వం అందిస్తుంటుంది. అలాగే ఎన్‌టీఆర్ వైద్య సేవ కింద వచ్చిన నిధులను మందుల కొనుగోలుకు, ఆపరేషన్ థియేటర్‌లో వస్తువుల కొనుగోలుకు, ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు వాటిని వినియోగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శ విన్పిస్తోంది. గతంలోని ఆస్పత్రి అధికారులు నెలకు సుమారు రూ.2లక్షలు వెచ్చించి మందులు, ఇతర పరికరాలు కొనుగోలు చేసేవారనేది సిబ్బంది మాట. ప్రస్తుతం నెలకు రూ.10వేలు కూడా లోకల్ పర్చేజ్‌కు వినియోగించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. హెచ్‌డీఎస్ కింద సుమారు రూ.20 లక్షలకు పైగా నిధులు ఉన్నాయనేది సమాచారం. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జిల్లా వైద్యశాలలో నెలకొన్న సమస్యలు అతి త్వరగా పరిష్కరించకపోతే అపరేషన్‌లు కూడా నిలిచిపోయే అవకాశం ఉందనేది వైద్యుల మాట.
ఆస్పత్రిలో లభించని బ్లేడ్, ఇతర పరికరాలు..
జిల్లా వైద్యశాలలో గైనిక్, ఆరో్థపెడిక్, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, డెంటల్, సాధారణ సర్జరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. నెలకు సుమారు 500కు పైగా సర్జరీలు చేస్తుంటారు. అయితే సర్జరీ చేయాలంటే రకరకాల బ్లేడ్‌లు అవసరం అవుతుంటాయి. బ్లేడ్‌లతో పాటు క్యాట్‌గట్స్, ప్రాలిన్, వైక్రిల్, ఎథిలాన్ వంటి వస్తువులు అవసరం. వీటిని తెప్పించాలని పలువురు వైద్యులు కోరుతున్నా వైద్యశాల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ విన్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి పరికరాలు గుంటూరులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో లభించకపోతే లోకల్‌గా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కానీ లోకల్‌గా కొనటానికి అధికారులు ఆసక్తి కనపర్చడం లేదనే విమర్శ విన్పిస్తోంది.
అలాగే పేద రోగులకు పంపిణీ చేసేందుకు అవసరమైన మందుల కొరత ఇక్కడ ఏర్పడింది. వాటిని లోకల్‌గా కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందించే వెసులుబాటు ఉన్నా అలా చేయడం లేదు. దీంతో వైద్యులు ఉన్న మందులనే రాస్తున్నట్లు సమాచారం.
పరికరాల కొనుగోలుకు అనుమతిస్తున్నాం..
ఆస్పత్రిలో అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. మిగిలిన వాటిని త్వరలో కొనుగోలు చేయిస్తాం.
డాక్టర్ సులోచన, సూపరింటెండెంట్