జగ్గయ్యపేట అర్బన్ : వంకరకాళ్లతో జన్మించిన చిన్నారిని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తెచ్చారు. చిన్నారి తల్లిదండ్రుల మోముల్లో సంతోషాన్ని నింపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన సాయి తారక్, శ్రీలత దంపతులకు ఆరు నెలల కిందట మహన్వితశ్రీ జన్మించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోనే జన్మించిన ఆ చిన్నారికి కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కఠారి హరిబాబు సలహాతో వారు అదే ఆస్పత్రిలో ఆర్థోపెటిక్‌గా పనిచేస్తున్న డాక్టర్ హరీష్‌ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. బాలికను పరీక్షించి తల్లిదండ్రులకు ఆయన ధైర్యం చెప్పారు. ఆరు నెలల్లో చిన్నారి కాళ్లు మామూలు స్థితికి చేరుకుంటాయని భరోసా ఇచ్చి.. 21వ రోజు నుంచి చికిత్స మొదలెట్టారు. వారం వారం ఆ చిన్నారి కాళ్లకు కట్లు కడుతూ మధ్యలో ఇంజక్షన్లు ఇస్తున్నారు.
మధ్యలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల ద్వారా కొంత వైద్య సాయం తీసుకున్నారు. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో చిన్నారి కాళ్లు దాదాపుగా మామూలు స్థితికి వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తుంటాయని, దీనిని క్లబ్ ఫుట్(సీటీఈవీ) అంటారని తెలిపారు. పుట్టిన వెంటనే చికిత్స మొదలెడితే ఫలితం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment