స్మశానానికి తీసుకెళ్తుండగా కదలిక..
వరంగల్ అర్బన్: అప్పుడే పుట్టిన పాప మృతిచెందిందని వైద్యులు నిర్ధరించడంతో.. కుటుంబ సభ్యులు పాపను స్మశానవాటికకు తీసుకెళ్లారు. మార్గమధ్యలో పాప బ్రతికే ఉన్నట్లు గుర్తించిన వారు తిరిగి ఆస్పత్రిలో చేరి వైద్యుల వైఖరీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి ఎదుట ఆదివారం వెలుగచూసింది. పెగడపల్లికి చెందిన శ్రీనివాస్-స్వప్న దంపతులకు ఈ రోజు ఎంజీఎం ఆస్పత్రిలో పాప జన్మించింది. కాగా పసిపాప అప్పటికే మృతిచెందిందని స్థానిక వైద్యులు ధ్రువీకరణ పత్రం అందించారు.
దీంతో స్మశానానికి తరలిస్తుండగా.. పాపలో కదలిక ఉండటం గమనించిన వారు తిరిగి ఆస్పత్రికి చేర్చి వైద్యుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనారోగ్యోంతో జన్మించిన చిన్నారికి వైద్యం అందించాల్సింది పోయి.. మృతిచెందిందని ధ్రువీకరణ పత్రం ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.